
వందశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి అధికారులు నిర్వహించిన వీసీలో కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, పరీక్షలంటే భయం ఉందన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్‌లలో విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను శ్రద్ధతో నేర్పించాలన్నారు. గతేడాది 80శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత రావడానికి గల కారణాలను ఆయా హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు బ్లాక్ బోర్టు క్లాసులతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్, ఐఎప్‌పీ ప్యానెల్ వంటి వాటిని ఉపయోగించుకొని తరగతులను నిర్వహించాలన్నారు. అపార్ ఐడీ కార్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు, సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం, భవిత సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, తదితర వాటిపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఈడబ్ల్యుయూడీసీ ఈఈ రామచంద్రం, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
జిల్లా కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ విజయేందిర తనిఖీ చేశారు.గోదాం సీల్‌ను సీసీ కెమెరాలు, భద్రతను పరిశీలించారు. గోదాం పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించరాదన్నారు. కలెక్టర్ వెంట డీటీ జాఫర్, ఇతర అధికారులు ఉన్నారు.