షెడ్డుకే పరిమితం! | - | Sakshi
Sakshi News home page

షెడ్డుకే పరిమితం!

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

మహబూబాబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీలో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఈమేరకు గతంలో రోడ్డు స్వీపింగ్‌మిషన్‌, కాల్వల పూడికతీత మిషన్‌ కొనుగోలు చేశారు. కాగా, అవి వారంరోజులు కూడా పని చేయలేదు. అవి పూర్తిగా పాడైపోయి షెడ్డుకే పరిమితమయ్యాయి. అలాగే చెత్త సేకరణ వాహనాలు తరచూ మరమ్మతులకు గురికావడంతో పట్టణ ప్రజలు రోడ్లపైనే చెత్త వేస్తున్నారు.

33 టన్నుల చెత్త సేకరణ..

పట్టణంలో ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఆ చెత్తను సిగ్నల్‌ కాలనీ, గాంధీపురం సమీపాల్లోని డంపింగ్‌ యార్డుల్లో డంప్‌ చేస్తున్నారు. సరిపడా కార్మికులు లేకపోవడంతో చెత్త సేకరణలో ఇబ్బందులు తప్పడంలేదు. నిత్యం కాలనీల్లోకి చెత్తసేకరణ వాహనాలు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు రోడ్లపైనే చెత్త వేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

మరమ్మతుల బారిన పలు వాహనాలు..

మున్సిపాలిటీకి సంబంధించి సగానికి పైగా వాహనాలు తరచూ మరమ్మతుల బారిన పడుతున్నాయి. రిపేర్‌లకే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతోంది. సగానికి పైగా వాహనాలు కొత్తవి కొనుగోలు చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. వాహనాల మరమ్మతులతో డ్రైవర్లు ఖాళీగా ఉంటున్నారు.

నిధులు వృథా..

బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సుమారు రూ.80 లక్షలతో రోడ్డు స్వీపింగ్‌ మిషన్‌, కాల్వలు శుభ్రం చేసే పూడికతీత మిషన్‌ కొనుగోలు చేశారు. ఇక్కడి రోడ్లపై స్వీపింగ్‌ మిషన్‌ పని చేయడం లేదు. అలాగే పూడికతీత మిషన్‌ కూడా నిరుపయోగంగా మారింది. అలాగే కొన్నేళ్ల క్రితం నాలుగు.. మూడు చక్రాల బ్యాటరీ ఆటోలను ఐసీఐసీఐ బ్యాంకు అందజేసింది. అయితే ఆ ఆటోలు ఎత్తు, లోతు ప్రాంతాల్లో ముందుకు కదలడం లేదు. బురదలో దిగబడి బయటికి రాకపోవడం లాంటి సమస్యలతో వాటిని వాడడం లేదు. ఒకటి పూర్తిగా పాడైపోగా మిగిలిన మూడింటిని కేవలం సర్‌లాంటి కార్యక్రమాల ప్రచారం కోసం వాడుతున్నారు.

గ్రాస్‌ కటింగ్‌ మిషన్ల కొనుగోలు..

ఇటీవల జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు వెచ్చించి ఆరు గ్రాస్‌ కటింగ్‌ మిషన్లు కొనుగోలు చేశారు. జవాన్‌కు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. అవి కూడా డీజిల్‌తో పనిచేస్తున్నాయి. ఆ మిషన్లు ఇక్కడ పెద్దగా ఉపయోగపడవని కార్మికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆదాయం పెంచేందుకు కమర్షియల్‌ ప్రాంతాల్లో యూజర్‌ చార్జీలు వసూలు చేసేందుకు నోటీస్‌లు ఇచ్చారు. ఇలా వచ్చే ఆదాయంతో ట్రాక్టర్లు కొనుగోలు చేయవచ్చు అనే ఆలోచనతో మున్సిపల్‌ అధికారులు ముందుకు సాగుతున్నారు.

జఠిలమవుతున్న పారిశుద్ధ్య సమస్య..

తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో పలు వార్డులకు వారానికి రెండు రోజులు మాత్రమే వాహనాలు వస్తున్నాయి. దీంతో రోడ్లపై, కాల్వల్లో చెత్త వేస్తున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి పర్యవేక్షణ పెంచితేనే పారిశుద్ధ్యం గాడిన పడుతుంది. లేకుంటే పట్టణం మురికికూపంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పాడైపోయిన రోడ్డు

స్వీపింగ్‌, పూడికతీత మిషన్లు

తరచూ చెత్త సేకరణ వాహనాలకు

మరమ్మతులు

మానుకోట మున్సిపాలిటీలో

జఠిలమవుతున్న పారిశుద్ధ్య సమస్య

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement