నెహ్రూసెంటర్: తెలంగాణ ఉద్యమకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్లోజు పాండురంగాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో సంఘ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని, కళాకారులను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలతో పాటు కళాకారులకు ఇంటి స్థలాలు, హెల్త్‌కార్డులు అందించాల ని కోరారు. కళాకారులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో కేదాసు రమేశ్, పిడుగు రాంమూర్తి, వీరన్న, రవీందర్, వేణు, సుధాకర్, ఉపేందర్, సాగర్ పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
గార్ల: లోఓల్టేజీ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయని, ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు గార్ల సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. లోఓల్టేజీ సమస్యతో మోటార్లతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమర్చే సమయానికి వారం రోజులు పడుతుందని, ఈలోపు వరి, మిర్చి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు స్పందించి లోఓల్టేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రైతులు మూడు బాబూలాల్, మదనలాల్, చంటి, లస్కర్, భాస్కర్, మధు, నాన్యా, భీముడు, శివాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ శిక్షణ
ముగించుకున్న జశ్వంత్‌రాజ్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన సంఘాల రవికుమార్, ప్రసన్నల దంపతుల కుమారుడు జశ్వంత్‌రాజ్ గ్రూప్–1లో 900 మార్కులకు గాను 465 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 323 ర్యాంక్, మల్టీజోన్–1లో 139 ర్యాంక్ సాధించి నాడు సీఎం చేతుల మీదుగా డీఎస్పీగా నియామకపత్రం అందుకు న్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. సోమవారం అకాడమీలో డీజీపీ అభిలాషబిస్త్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నాడు.


