● ఐదు నిమిషాల్లోనే కల్లుగీత
● రూ.30 వేల ఖర్చుతో వినూత్న ప్రయోగం
● ఈరవెన్నులో రైతు మహేందర్ ఆలోచన
పాలకుర్తి టౌన్ : గీతకార్మికులు తాటి చెట్టు ఎక్కి కల్లు గీయాలంటే మోకు సాయంతో ప్రాణాలు పణంగా పెట్టి నిమిషాల తరబడి శ్రమించాల్సిందే. కానీ.. ఓ వ్యక్తి తన వినూత్న ఆలోచనతో ఈ కష్టానికి సరికొత్త పరిష్కారం చూపించాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన రైతు అనుముల మహేందర్ వినూత్న ప్రయోగం చేశారు. తన మూడెకరాల వ్యవసాయ భూమిలోని తాటి చెట్లు ఎక్కి కల్లు గీసేందుకు గీత కార్మికులు ముందుకు రాకపోవడంతో సొంత ఖర్చు రూ. 30 వేలతో ఇనుప కడ్డీలతో నిచ్చెనలు ఏర్పాటు చేశారు. ఇంటి మెట్లు ఎక్కినట్లు చెట్టు పైకి అలవోకగా ఎక్కుతూ కేవలం ఐదు నిమిషాల్లోనే సులువుగా చేరుకుంటూ కల్లు గీస్తున్నాడు. శ్రమను తగ్గించడంతోపాటు సమయాన్ని ఆదాచేసే ఈ ప్రయోగం సాన్థికుల దృష్టిని ఆకర్షిస్తోంది.


