మనసెలా వచ్చింది అమ్మా.. | - | Sakshi
Sakshi News home page

మనసెలా వచ్చింది అమ్మా..

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

– కురవి

గోరుముద్దలు పెట్టి.. అల్లారుముద్దుగా పెంచుకున్నావు అమ్మా. మాకు జ్వరమొస్తే నీ మనసు తల్లడిల్లేది తల్లి. ఒళ్లుకాలితే రాత్రంతా మెలకువతో ఉండి ఒళ్లంతా చన్నీటితో తుడిచేదానివి. పోట్రాయి తాకి కిందపడితే క్షణం ఆలోచించకుండా పరుగున వచ్చి హత్తుకుని, గాయాలను పరిశీలించి కన్నీటి పర్యంతమయ్యేదానివి. అంత ప్రేమగా చూసుకునే నీవు మమ్ముల్ని నీతో పాటు బావిలోకి ఎలా నెట్టాలనిపించింది అమ్మా. ఈ మధ్య నాన్నతో ఏ విషయంలోనో గొడవ పడుతున్నావు. ఆ గొడవ ఏమిటో మాకు అర్థమయ్యేది కాదు. మధ్యమధ్యలో అమ్మమ్మ విషయం తీయడం గమనించాం. అమ్మమ్మతో సామరస్యంగా మాట్లాడుకుంటే సరిపోయేది కదా అమ్మా. నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి ఉందామని నాన్నకు మాటిచ్చావు. మధ్యలోనే మాట తప్పి నీతో మమ్ముల్ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లావు అమ్మా.. కురవి మండలం లింగ్యా తండాలో తల్లి అనూష తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని తీసుకొని వెళ్లి వ్యవసాయ బావిలో దూ కి ఆత్మహత్య చేసుకుంది. కాగా, తల్లితో పాటు ముక్కుపచ్చలారని పిల్లల మృతితో తండాలో విషాదం నెలకొంది.

బతికిన పెద్ద కూతురు రుత్విక..

లింగ్యా తండాకు చెందిన భార్యాభర్తలు బానోత్‌ నవీన్‌, అనూష(31)మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన అనూష ఆత్మహత్య చేసుకుందామని శనివారం తన ముగ్గురు పిల్లలు రుత్విక, వర్షిణి(8), వృశాంత్‌క్రిష్ణ(4) తండా నుంచి తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే మార్గంలో బైక్‌పై వస్తున్న మాలోత్‌ చిన్ని అనే వ్యక్తి వారు వెళ్లడాన్ని గమనించి ఆపాడు. ఎటు వెళ్తున్నారని వరుసకు అక్క అయిన అనూషను అడిగాడు. పొలం వద్దకు వెళ్తున్నామని, నీళ్లు పెట్టి వస్తామని చెప్పింది. కరెంట్‌ లేదు ఇంటికి వెళ్దామని అన్నాడు. దీంతో కోతులు వస్తున్నాయి.. వాటిని తరమాలని అనడంతో అనుమానం వచ్చిన చిన్ని బైక్‌ ఎక్కాలని అడిగాడు. అందరిని బైక్‌ ఎక్కించుకుని తండాకు వస్తున్నాడు. ఈ క్రమంలో అనూష బైక్‌ ఆపమని కొడును తీసుకుని దిగింది. వర్షిణి బైక్‌ పైనుంచి పడిపోయింది. ఆమె పెద్దబిడ్డ రుత్విక బైక్‌ దిగలేదు. ముగ్గురు కలిసి పొలం వద్దకు వెళ్తుండగా.. చిన్న వెళ్లొద్దని వారించినా వినలేదు. చేసేదేమీ లేక రుత్వికను తీసుకొని తండాకు వెళ్లి జరిగిన విషయం బావ అయిన నవీన్‌కు చెప్పాడు చిన్ని. ఈ సమయంలో అనూష పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదం నెలకొంది.

మమ్ముల్ని నీతో ఎలా

తీసుకెళ్లాలనిపించింది

చిన్న గొడవ మన ముగ్గురిని

బలి తీసుకుందే..

సామరస్యంగా మాట్లాడుకుంటే

బతికేవాళ్లం కదా అమ్మా

మనస్తాపంతో పిల్లలతో కలిసి

బావిలో దూకి తల్లి ఆత్మహత్య

ఆ కుటుంబంలో అందరూ

అమావాస్య రోజే మృతి..!

అమావాస్య రోజే అందరూ మృతి...

అనూష తండ్రి వీరు, అన్న గణేశ్‌ గతంలో అమావాస్య రోజే మృతిచెందారని తండాలో చర్చించుకుంటున్నారు. అంతకు ముందు అనూష తాత నాన్నమ్మ కూడా చనిపోవడంతో ఆ ఇల్లు కలిసిరావడం లేదని మాట్లాడుకున్నా రు. అనూష, ఆమె కూతురు, కుమారుడు సైతం పితృఅమావాస్య రోజే చనిపోవడం గమనార్హం. కాగా, కురవి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న రుత్విక, వర్షిణిలను బతుకమ్మ పండుగ సెలవులు కావడంతో శుక్రవారం తండ్రి నవీన్‌ ఇంటికి తీసుకొచ్చాడు. సెలవులు లేకపోయినా వర్షిణి బతికేదేమోనని తండావాసులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement