పదేళ్లు.. అభివృది బాట | - | Sakshi
Sakshi News home page

పదేళ్లు.. అభివృది బాట

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మానుకోట నూతన జిల్లాగా ఆవిర్భవించింది. అప్పటికే ఉన్న మహబూబాబాద్‌ డివిజన్‌తో పాటు తొర్రూరు కొత్త డివిజన్‌, 16మండలాలతో కూడిన జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం మరో రెండు మండలాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 18 మండలాలతో కూడిన జిల్లా పది వసంతాలు పూర్తిచేసుకుంది. దశాబ్దకాలంలో జిల్లా కేంద్రం మానుకోట ముఖచిత్రం మారింది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది.

చేరువైన పాలన..

గతంలో కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులను కలవాలంటే వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌ వెళ్లాల్సిందే. మారుమూల ప్రాంతాల నుంచి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ముందురోజు వెళ్లి అక్కడ బసచేసి మరుసటి రోజు అధికారులను కలిసేది. నూతన మానుకోట జిల్లా ఏర్పాటు తర్వాత చుట్టూరా ఒకటి, రెండు గ్రామాలు మినహా.. మొత్తం 60కిలోమీటర్ల పరిధిలోనే అన్ని మండల కేంద్రాలు ఉన్నాయి. దీంతో అధికారుల పర్యటనలు, ప్రజలు జిల్లా కేంద్రం వెళ్లేందుకు సులభతరమైంది. అదే విధంగా తొర్రూ రు కొత్త రెవెన్యూ డివిజన్‌ కావడంతోపాటు, పెద్దవంగర, దంతాలపల్లి, గంగారం, చిన్నగూడూరు మండలాలు ముందుగా, ఇనుగుర్తి, సీరోలు మండలాలు తర్వాత ఏర్పడడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు మండల కేంద్రం చేరువైంది. అధికారులకు కూడా పాలన సులువైంది.

ఉన్నతాధికారులను నేరుగా కలిసే అవకాశం..

జిల్లా ఏర్పాటకు ముందు సాధారణ ప్రజలు కలెక్టర్‌ను కలవడం అంత ఈజీకాదు. కానీ జిల్లా ఏర్పాటు తర్వాత ఆ అంతరం తగ్గింది. జిల్లా ఏర్పాటుతో తొలి కలెక్టర్‌గా వచ్చిన ప్రీతి మీనన్‌తోపాటు తర్వాత వచ్చిన శివలింగయ్య, వీపీ గౌతమ్‌, శశాంక, అద్వైత్‌సింగ్‌ తోపాటు ప్రస్తుత కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ వరకు ప్రజలతో మమేకమై పనిచేస్తూ వస్తున్నారు. అదే విధంగా జిల్లా పోలీస్‌ బాస్‌గా పనిచేసిన మురళీధర్‌, భాస్కరన్‌, కోటిరెడ్డి, శరత్‌చంద్ర పవార్‌, సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, చంద్రమోహన్‌, రామ్‌నాథ్‌కేకన్‌తో పాటు ప్రస్తుత ఎస్పీ శబరీష్‌ జిల్లాలోని గుడుంబా, గంజాయి కట్టడి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణంతో ఒకే చోట కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

విద్య, వైద్య రంగాల్లో ప్రగతి..

జిల్లా ఏర్పాటుతో విద్య, వైద్య రంగాల్లో ప్రగతి సాధించింది. జిల్లా కేంద్రంలోని సాధారణ ఏరియా ఆస్పత్రి.. ప్రస్తుతం 330 పడకలతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. దీనికి అనుగుణంగా మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటు, విద్యార్థులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, స్టాఫ్‌ నర్సులతో ప్రతీ రోజు వెయ్యిమందికి పైగా సేవలు అందుతున్నాయి. అదేవిధంగా గూడూరు, గార్ల, మరిపెడ, తొర్రూరులో సీహెచ్‌సీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇంజనీరింగ్‌, హార్టికల్చ ర్‌, ఫార్మసీ కాలేజీలు, కేసముద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలు, కేజీబీవీలు, గురుకులాల ఏర్పాటుతో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది.

మారిన మానుకోట..

సాధారణ పంచాయతీ నుంచి అప్పుడే మున్సిపాలిటీగా మారిన మహబూబాబాద్‌ పట్టణం పది సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. దీంతో అప్పటి వరకు పల్లెకు ఎక్కువ.. పట్టణానికి తక్కువగా ఉన్న మానుకోట రూపురేఖలు మారాయి. పట్టణంలోని భూములకే కాకుండా చుట్టూరా 10 కిలోమీటర్ల మేరకు భూములకు రెక్కలు వచ్చాయి. జిల్లా అధికారులు, వైద్య, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, హార్టికల్చర్‌ కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంతో పాటు దేశనలుమూలల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీంతో షాపింగ్‌ మాల్స్‌, పట్టణ సుందరీకరణ, బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కల్చర్‌ పెరిగింది. పది సంవత్సరాల్లో మానుకోట పట్టణంతోపాటు, ఈ ప్రాంతంలో కూడా మార్పు వచ్చింది.

రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలతో మానుకోట జిల్లా ఏర్పాటు

పది సంవత్సరాల్లో మారిన ముఖచిత్రం

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రగతి

ప్రజలకు చేరువైన పాలన,ఉన్నతాధికారులను నేరుగా కలిసే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement