మహబూబాబాద్: జిల్లా పశుసంవర్థకశాఖలో చాలా వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా కరెంట్ బిల్లుల పెండింగ్ అధికారులకు తలనొప్పిగా మారింది. ఫ్రిజ్‌లలో విలువైన వ్యాక్సిన్‌లు ఉంటాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బిల్లుల పెండింగ్‌తో పాటు సిబ్బంది, మందుల కొరత కూడా వెంటాడుతోంది.
45 పశు వైద్యశాలలు
జిల్లాలో 3 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు (ప్రాంతీయ పశువైద్యశాలలు), 23 ప్రైమరీ సెంటర్లు, 19 సబ్ సెంటర్లు.. మొత్తంగా 45 వైద్యశాలలు ఉన్నాయి. 2019లో చేపట్టిన పశుగణన ప్రకారం తెల్లజాతి, నల్లజాతి పశువులతో పాటు గొర్రెలు, మేకలు, ఇతర అన్ని కలిపి 11,85,568 ఉన్నాయి. కాగా ఏడాది క్రితం చేపట్టిన గణన ప్రకారం 8,40,114 పశువులు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా పాడి పశువుల సంఖ్య తగ్గుతోంది.
సిబ్బందికి ఊరట..
జిల్లా పశుసంవర్థక శాఖలో కొన్ని సంవత్సరాల పాటు చాలా పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవల బదిలీల్లో భాగంగా చాలా పోస్తులు భర్తీ చేశారు. ప్రధానంగా నాలుగు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడంతో పశువుల వైద్యం విషయంలో కొంత మెరుగు పడింది. కాగా 15 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు నాలుగు ఖాళీగా ఉన్నాయి. 38 అటెండర్ పోస్టులకు 10పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్‌లో 10 అటెండర్ పోస్టులకు 6పోస్టులు భర్తీ చేశారు. నాలుగు పోస్టులు కోర్టు కేసులతో ఖాళీగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
అధ్వానంగా పలు ఆస్పత్రులు..
పూర్తిస్థాయిలో అటెండర్లు లేక పలు పశువైద్యశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆ పశువైద్యశాలల ఆవరణ అంతా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చెత్తాచెదారంతో నిండాయి. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కొన్ని సంవత్సరాల పాటు అటెండర్ లేడు.. కాగా వారం నుంచి అవుట్ సోర్సింగ్‌లో అటెండర్ పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు లేకపోవడంతో ఆవరణ అంతా చిన్న పాటి డంపింగ్ యా ర్డుగా మాదిరిగా ఉంది. అవరణ చిన్నపాటి అడవిని తలపిస్తోంది.
బిల్లులు పెండింగ్‌తో..
45 పశు వైద్యశాలల విద్యుత్ బిల్లులు రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని సిబ్బంది పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తున్నా.. బిల్లులు చేసి డీటీఓకు పంపినా అక్కడ బిల్లులు పాసై ఫైనాన్స్ విభాగం వద్ద అప్రూవల్ కావడం లేదని చెబుతున్నారు. రెండు సంవత్సరాల విద్యుత్ బిల్లులు రూ.7లక్షలపైనే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య రెండు క్వార్టర్స్‌ల బిల్లుల బడ్జెట్ కేటాయించినప్పటికీ ఫైనాన్స్ ఆమోదం లేదు. జిల్లా పశుసంవర్థక అధికారి కారు కిరాయి ఇతరత్రా ప్రతీ నెల రూ.33,000 కాగా.. తొమ్మిది నెలలుగా ఆ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. బడ్జెట్ కేటాయించినా అప్రూవల్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు ఇతరత్రా బిల్లులు కూడా రావడం లేదని చెబుతున్నారు.
శిథిలావస్థలో..
జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలతో పాటు పలు వైద్యశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి నిర్మాణాలు కేవలం ప్రతి పాదనలకే పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా మూగజీవాలకు సైలె న్ బాటిళ్లతో పాటు పలు మందులు రావడం లేదు.
ఆర్థికభారం..
ఆఫీస్ మెయింటనెన్స్ కింద మూడు నెలలకు రూ.20,000 చొప్పున సంవత్సరానికి రూ.80,000 ఇవ్వాలి. కానీ 2025–26 బిల్లులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. చివరికి తెల్లకాగితం కొనడానికి కూడా జేబులో నుంచే ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
పశు సంవర్థకశాఖలో రూ.7లక్షల కరెంట్ బిల్లులు పెండింగ్
ఏడాదిగా రాని ఆఫీస్ మెయింటనెన్స్ బిల్లు
ఆర్థిక భారం పడుతుందంటున్న సిబ్బంది
వేధిస్తున్న సిబ్బంది కొరత
పూర్తిస్థాయిలో లేని పలు మందులు


