నిర్విరామంగా చేపట్టాలి
కాళేశ్వరం : సరస్వతీనది అంత్యపుష్కరాల పనులు రాత్రిపగలు అనే తేడా లేకుండా నిర్విరామంగా చేపట్టి మే మొదటి వారంలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ఇటీవల రూ.21.34కోట్లు మంజూరు చేయగా పలు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి సరస్వతీఘాట్, నిర్మాణంలో ఉన్న మ్యూజియం, అందులో ఏర్పాటు చేయనున్న విగ్రహాలు, సరస్వతీఆలయం వద్ద నిర్మిస్తున్న అక్షరాభ్యాస మండపం పనులు, వీఐపీ ఘాట్ వద్ద మకర, హంస తోరణాల పనులు పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో సంబంధితశాఖ అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సరస్వతీనది ఆది పుష్కరాల్లో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ లోకేషన్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ ఇంజినీర్లకు సూచించారు. హెలిపాడ్, బారికేడ్లు ఏర్పాటుతో పాటు నదిలో భక్తులు భద్రతకు చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. 12 రోజుల పాటు హారతి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈఓ మహేశ్, అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి శైలజారామయ్యర్ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు.
మే మొదటివారంలోగా
ప్రారంభోత్సవాలు చేయాలి
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజారామయ్యర్


