మరిపెడ రూరల్: జిల్లాలోని మరిపెడ మండలంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గుట్టలు, రాళ్లను తొలగించేందుకు అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు (జిలెటిన్‌స్టిక్స్) వినియోగిస్తున్నారు. పేలుడు పదార్థాల కారణంగా శబ్దాలతో కూడిన విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో గుట్టల ప్రాంతంలోని అటవీ జీవులు, పక్షులకు ముప్పు ఏర్పడుతోంది. పేలుళ్ల శబ్దం, ధూళికి ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్ల జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో అటవీ జీవులు అంతరించే పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అడ్డుగోలుగా పేలుళ్లు జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు కరువు..
ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే పేలుడు పదార్థాల వినియోగం జోరుగా కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలతో గుట్టలు, రాళ్లను తొలుస్తున్నారు. భూముల చదును, ప్లాట్లలో అడ్డు వచ్చిన రాళ్లను పగలగొట్టేందుకు కంప్రెషర్ ద్వారా బండరాళ్లుకు రంధ్రాలు తొలుస్తున్నారు. ఆ తర్వాత అనుమతులు లేకుండా కొనుగోలు చేసుకున్న పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. చుట్టుపక్కల మూగజీవాలతో పాటు ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట యథేచ్ఛగా పేలుళ్లు జరుగుతున్నప్పకీ మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మరిపెడ నుంచి మహారాష్ట్రకు..
గత ఏడాది ఇక్కడి నుంచి మహారాష్ట్రకు పేలుడు పదార్థాలను ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూలీ పనుల కోసం వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లాడు. అక్కడ పేలుడు పదార్థాలు పట్టుబడగా అవి మరిపెడ నుంచి సరఫరా అయినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బృందం అధికారులు మరిపెడ మండంలోని భూక్యతండాలో ఓ అనుమానిత వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, వరంగల్‌కు చెందిన ఓ పేలుడు పదార్థాల వ్యాపారి మరిపెడ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత అధికారులతో ఉన్న సంబంధాలతోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పేలుడు పదార్థాలపై నిఘా పెట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అవరసమైతే నిబంధనలు అతిక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని అంటున్నారు.
విచ్చలవిడిగా పేలుడు పదార్థాల వినియోగం
గుట్టలు, రాళ్లు తొలగించేందుకు వాడకం
అటవీ జీవులు, పక్షులకు ముప్పు
జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం
గత ఏడాది మరిపెడలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు
చోద్యం చూస్తున్న మైనింగ్ అధికార యంత్రాంగం..


