మహబూబాబాద్: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండలస్థాయిలో న్యాయం జరగకపోతే బాధితులు ప్రజా వాణికి వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో వస్తున్నారు. దివ్యాంగులు అయితే ప్రత్యేకంగా ఆటోల్లో వచ్చి వినతులు ఇస్తున్నారు. అయితే కలెక్టర్ ఉంటేనే ప్రజావాణి సవ్యంగా సాగుతోంది. లేకుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అధికారులు ఇలా..
సోమవారం జరిగిన ప్రజావాణిలో ముందుగా అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ తన చాంబర్‌లో ఉన్నప్పటికీ.. పలు పనుల వల్ల కొంత ఆలస్యంగా వచ్చారు. ఆ సమయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కలెక్టర్ లేకుంటే ప్రతీ ప్రజావాణి ఇలాగే సాగుతోంది. కొంతమంది సెల్ ఫోన్‌లో బిజీగా.. మరికొందరు ముచ్చట్లలో, ఇంకొంతమంది ఆఫీస్ పని చేసుకుంటూ ల్యాప్ టాప్‌ల్లో మునిగిపోయారు.
షోకాజ్ నోటీస్‌లు ఇచ్చినా..
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ మా ట్లాడుతూ.. కొంతమంది అధికారులకు షోకాజ్ నో టీస్‌లు ఇచ్చినా హాజరుకావడం లేదన్నారు. తదుపరి పరిణామాలకు మీరే బాధ్యత వహించాలన్నా రు. జిల్లాస్థాయి అఽధికారులు రాకుండా కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారు. కలెక్టర్ సీరియస్‌గా తీసుకుంటేనే ప్రజావాణి సమర్థవంతంగా జరుగుతుందని దరఖాస్తుదారులు అంటున్నారు.
కలెక్టర్ వస్తేనే..
ప్రజావాణికి కలెక్టర్ స్నేహశబరీష్ వస్తేనే దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో వచ్చి క్యూ కడుతున్నారు. కలెక్టర్‌కు దరఖాస్తు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆమె కూడా ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ప్రజా వాణి కొంతకాలంగా గాడిన పడుతోంది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రతీ ప్రజావాణిలో కలెక్టర్ ఆదేశించినా పూర్థిస్థాయిలో పరిష్కారం కాలేదు.
ఇప్పటికే కొంతమందిపై వేటు..
ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలో పలు కార్యాలయాలను సందర్శించారు. కార్యాలయాల నిర్వహణ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్‌ను సరెండర్ చేసిన విషయం విదితమే. ఆకస్మిక తనిఖీలతో కార్యాలయాల్లో అధికారులు సాయంత్రం 6గంటల వరకు ఉంటున్నారు. ఫైళ్లు ఇతరత్రా అన్ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలా వరకు కార్యాలయాల్లో మార్పు కన్పిస్తోంది. జిల్లాలోని 406 మంది జీపీఓలకు డిప్యుటేషన్ వేశారు. మరికొంత అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
జిల్లా పాలనాధికారి వస్తేనే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్న ప్రజలు
హాజరుకాని కొంతమంది
జిల్లాస్థాయి అఽధికారులు
షోకాజ్ నోటీస్‌లు ఇచ్చినా వీడని నిర్లక్ష్యం


