పల్లె స్ఫూర్తి.. కావాలి దీప్తి! | Helmets are mandatory in 36 villages and 15 wards of Mahabubabad district | Sakshi
Sakshi News home page

పల్లె స్ఫూర్తి.. కావాలి దీప్తి!

Apr 8 2026 12:50 AM | Updated on Apr 8 2026 12:50 AM

Helmets are mandatory in 36 villages and 15 wards of Mahabubabad district

మహబూబాబాద్‌ జిల్లాలోని36 గ్రామాలు,15 వార్డుల్లో హెల్మెట్‌ తప్పనిసరి 

పోలీసుశాఖ ఆధ్వర్యంలోమన ఊరు–మన బాధ్యత పేరిట కార్యక్రమం

మహబూబాబాద్‌ జిల్లా కురవిమండలం తిర్మలాపురం గ్రామంలోని జనాభా 765. గ్రామంలో 75 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాల బారినపడి పలువురు మృతి చెందారు. మరోసారి గ్రామస్తులు ప్రమాదాలకు గురి కావొద్దని, ప్రమాదవశాత్తు పడినా తలకు గాయం కాకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనం ఉన్న ప్రతీ ఒక్కరు హెల్మెట్‌ ధరించి వాహనం నడపాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్‌ కనకటి అచ్చమ్మ తన సొంత డబ్బులతో అందరికీ హెల్మెట్లు కొనుగోలు చేసి అందజేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనం పడిపేవారు లేరు.

సాక్షి, మహబూబాబాద్‌: నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్‌ వాడకంపై హైదరాబాద్‌ మహానగరంలో కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మారుమూల పల్లెల్లో మాత్రం హెల్మెట్‌ తప్పనిసరని తీర్మానం చేసుకొని అమలుచేయడం విశేషం. మహబూబాబాద్‌ జిల్లాకు ఇటీవల వచ్చిన ఎస్పీ శబరీష్‌ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ఆలోచించారు. కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లతో గత నెల 17న జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. 

మన ఊరు–మన బాధ్యత పేరుతో చేపట్టిన కార్యక్రమం గురించి వివరించారు. సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. వారితో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి పలుమార్లు మీటింగ్‌లు పెట్టి కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. దీంతో మూడు అంశాలపై ప్రతీ గ్రామంలో తీర్మానం చేశారు. ఈ ఫొటోలో ద్విచక్రవాహనదారుడికి పోలీసు హెల్మెట్‌ పెడుతున్న దృశ్యం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలోనిది. 

సర్పంచ్‌ భూక్య జ్యోతి గ్రామ సభ నిర్వహించి ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని తీర్మానం చేశారు. గ్రామంలో 164 ద్విచక్ర వాహనాలు ఉండగా.. తీర్మానం చేసిన వెంటనే 93 మంది హెల్మెట్‌లు కొనుగోలు చేశారు. మిగిలిన 71 మందికి దాతల సహకారంతో పోలీసులు హెల్మెట్లు కొనుగోలు చేసి ఇచ్చారు.  

మొదటి విడత 36 పంచాయతీలు,15వార్డులు 
జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే అన్ని గ్రామాల్లో ఒకేసారి హెల్మెట్‌ధరించడం, గంజాయి నిర్మూలించడం, సీసీ కెమెరాల ఏర్పాటు వీలు కాదని గ్రహించారు. ముందుగా ప్రతీ మండలానికి రెండు గ్రామాల చొప్పున 36 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల నుంచి 15 వార్డులను ఎంపిక చేసుకుని గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఆయా గ్రామాలు, వార్డుల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్‌ ధరించి వాహనం నడిపేలా చర్యలు తీసుకున్నారు. 

గ్రామస్థాయి నుంచిమార్పురావాలని.. 
ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతావారోత్సవాలు, గంజాయి నిర్మూలన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. అయితే గ్రామస్థాయి నుంచి మార్పు వస్తే ఇది శాశ్వతంగా ఉంటుందని భావించాం. కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు, వార్డుకౌన్సిలర్లతో సమావేశం పెట్టగా.. మంచిస్పందన వచ్చింది. మొదటి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపుతున్నారు.దశలవారీగా జిల్లా మొత్తం అమలయ్యేలా ముందుకెళ్తున్నాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement