15 నెలల్లో ఏకంగా 1.20 లక్షల వాహనాల విక్రయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల మొత్తం రూ.1,450 కోట్లకు చేరుకుంది. 2024 నవంబర్ 16న ఈవీ పాలసీ సవరించాక కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చిన రాయితీనే రూ.967 కోట్లుగా ఉండటం విశేషం. పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మొత్తం మిగులుతుండటంతో ఈవీల కొనుగోలుపై ప్రజలు మక్కువ చూపుతున్నారు.
ఫలితంగా కేవలం 15 నెలల కాలంలో ఏకంగా 1.20 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీల సంఖ్య 2.90 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌తో రాయితీ గడువు ముగియనుంది. రాయితీల వల్లనే ఈవీల కొనుగోలు భారీగా పెరిగిన నేపథ్యంలో, మరికొంతకాలం రాయితీలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈవీల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.


