సుప్రీంకోర్టు విచారణలో ఉన్నా.. సవరించిన అంచనా వ్యయాన్ని గత నెల 25న ఆమోదించిన సీడబ్ల్యూసీ టీఏసీ
శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడిన తెలుగు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం
దీనిపై 2023, ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్ జగన్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఒక్క నీటి చుక్కను కేటాయించకపోయినా.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా 29.9 టీఎంసీల నీటిని తరలించి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో కర్ణాటక సర్కార్ అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రకు కేంద్రం లైన్‌క్లియర్ చేసింది. గత నెల 20న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన సమావేశమైన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక సలహామండలి (టీఏసీ) సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఆ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.21,167.93 కోట్లుగా ఆమోదించింది. దీనికి సంబంధించిన సమావేశ మినిట్స్ వివరాలను సీడబ్ల్యూసీ విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2023, ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో నాటి ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే కేంద్రం అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేసి 130 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించడానికి కర్ణాటక సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆధారపడిన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించనుంది. ప్రధానంగా తుంగభద్ర జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) రైతాంగానికి పెద్దదెబ్బ అని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రిబ్యునళ్ల తీర్పులకు విరుద్ధంగా...
తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్టు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్‌భద్ర ప్రాజెక్టును 2015లో కర్ణాటక చేపట్టింది.
2019, మార్చి నాటికే రూ.4,830 కోట్లను ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసి అప్పర్‌తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్‌భద్ర ద్వారా 2019–26 వరకు 3.80 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్‌కు తరలించింది.
నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు జాతీయ హోదా
అప్పర్‌భద్రకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను సీడబ్ల్యూసీ తీసుకోవాలి. కానీ..రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్24న సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని పేర్కొంటూ వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న లేఖ రాసింది.
ఈ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్‌భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్‌శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది.
దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021, నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని.. దానికి జాతీయ హోదా ఇవ్వకూడదని నాటి కేసీఆర్ సర్కార్‌తోపాటు వైఎస్.జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ.. వాటిని బుట్టదాఖలు చేసి 2022, ఫిబ్రవరి 15న అప్పర్‌భద్రకు జాతీయ హోదా కల్పించింది.
వర్షాభావంలో రాష్ట్రానికి కష్టమే.. : అప్పర్ భద్ర ప్రాజెకు పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు.


