రెండేళ్లలో 10,327వైద్య పోస్టులు భర్తీ చేశాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లకు నియామక పత్రాలు అందజేత
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్/గన్‌ఫౌండ్రి : రెండేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే 10,327 ఉద్యోగాలు భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఇంకో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు మంత్రి దామోదర నియామక పత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమన్న నమ్మకం కలుగుతోందన్నారు.
రాష్ట్రంలో వైద్యుల కొరత లేకుండా, ప్రజలకు సరైన సమయానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 10,327 పోస్టులను భర్తీ చేయగా ఇంకా 6,512 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అందులో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 1,000 స్పెషలిస్ట్ డాక్టర్, 475 అసిస్టెంట్ ప్రొఫెసర్, 732 ఫార్మసిస్ట్, ఇతర పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నియామకాలన్నీ సమయానికి పూర్తి చేసి ప్రతి హాస్పిటల్‌ను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు.
నియామకాలతోపాటు ఆసుపత్రు ల్లో మౌలిక వసతులు, యంత్ర పరికరాలు, మందులు, డయాగ్నస్టిక్ సేవలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వైద్యులకు కొన్ని సూచనలు చేశారు. ‘సేవా భావంతో పనిచేయండి. ప్రతి రోగిని మానవత్వంతో చూడండి. నైతిక విలువలను పాటించండి. హైదరాబాద్‌లోనే ఉండాలి.. పట్టణాల్లోనే పోస్టింగ్ కావాలనే ధోరణి మార్చుకోండి. కొంతకాలమైనా జిల్లాల్లో పని చేయండి. మీ జ్ఞానం, మీ సేవ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి’అని చెప్పారు.
ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది.. : ప్రజారోగ్యమే సమాజాభివృద్ధికి బలమైన పునాది అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. డయాలసిస్ సేవలను విస్తరిస్తూ కొత్తగా 79 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 1,100 కోట్లతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయడంతోపాటు 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను బలోపేతం చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 213 నూతన అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు.
ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 80 శాతం వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అవార్డులను అందజేశారు.
నిమ్స్‌లో కేన్సర్ చికిత్స యంత్రం, ఎర్రగడ్డలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభం
నిమ్స్‌లో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని మంత్రి దామోదర మంగళవారం ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కేన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
అలాగే ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వ్యాధుల చికిత్సాలయం ప్రాంగణంలో నిర్మించిన ‘డీ–అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మంత్రి దామోదర ప్రారంభించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి గుర్తించి చికిత్స పొందడం అవసరమని.. దీనిపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.


