మీ మినట్స్‌తో మాకు తీవ్ర నష్టం | Telangana writes a strong letter to the Central Water Association | Sakshi
Sakshi News home page

మీ మినట్స్‌తో మాకు తీవ్ర నష్టం

Apr 8 2026 12:29 AM | Updated on Apr 8 2026 12:29 AM

Telangana writes a strong letter to the Central Water Association

వాటిని న్యాయస్థానాల్లో చర్చకు, ఉత్తర ప్రత్యుత్తరాలకు వాడరాదు

కేంద్ర జల సంఘానికి ఘాటుగా లేఖ రాసిన తెలంగాణ  

జల వివాదాల కమిటీ సమావేశ మినట్స్‌ను రికార్డు చేసి పంపిన సీడబ్ల్యూసీ 

మినట్స్‌లోని 8 (1), (2) పేరాలు మినహా మిగిలిన అంశాలను అంగీకరించమన్న తెలంగాణ 

అవాస్తవాలను సరిచేయాలని సీడబ్ల్యూసీని కోరిన రాష్ట్రం  

టెలిమెట్రీ కేంద్రాలపై కృష్ణాబోర్డు తీరును సైతం తప్పుబట్టిన రాష్ట్రం 

తెలంగాణ లేఖపై ఏపీ అభిప్రాయం కోరిన సీడబ్ల్యూసీ  

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గత జనవరి 30న ఢిల్లీలో తొలిసారిగా సమావేశమై చర్చించిన అంశాలతో సీడబ్ల్యూసీ రూపొందించిన మినట్స్‌లో అవాస్తవాలు, సత్యదూరమైన అంశాలున్నాయని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యకార్యదర్శి, కృష్ణాబోర్డు సభ్యులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో వెల్లడించిన పలు అభిప్రాయాలు అవాస్తవమని..న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు వాటిని పరిగణనలోకి తీసుకుంటే తమ రాష్ట్ర వాదనలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పెదవి విరిచింది. కేంద్రం/ ఏ రాష్ట్రం/ఇతర ఏ సంస్థ కూడా మినట్స్‌లో పేర్కొన్న అసంపూర్ణ చర్చలను ఏ న్యాయస్థానంలో చర్చ, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం వాడకూడదని తేల్చి చెప్పింది. 

మినట్స్‌లోని పేరా 8 (1), (2)తో మినహా ఇతర అంశాలతో అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌ తాజాగా సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్‌ అథారిటీ (పీఏఓ)కి లేఖ రాశారు. ఈ లేఖపై ఏపీ అభిప్రాయాన్ని సీడబ్ల్యూసీ కోరింది. తెలంగాణ లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

గోదావరి జలాల కేటాయింపులు జరగలేదనడం తప్పు  
గోదావరి జలాలను రాష్ట్రాలకు నిర్దిష్ట పరిమాణంలో కేటాయింపులు జరపలేదని మినట్స్‌లో సీడబ్ల్యూసీ పేర్కొనడం అసంపూర్ణ వ్యాఖ్య. ఇది తెలంగాణ వాదనలకు నష్టం కలిగిస్తుంది. రాష్ట్రాల మధ్య జరిగిన వివిధ అంతర్రాష్ట్ర ఒప్పందాల ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్‌ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు నిర్దేశిత ప్రాంతాల వద్ద నీటి లభ్యత ఆధారంగా సరైన నాణ్యత, పరిమాణంతో కూడిన నిబంధనల రూపంలో కేటాయింపులు జరిపింది. గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పునకు జత చేసిన అనుబంధం–బీలో వివిధ సబ్‌ బేసిన్లలోని నీటి వినియోగాన్ని స్పష్టీకరించింది.  

» తెలంగాణలోని కాళేశ్వరం, సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల వంటి ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు..75 శాతం లభ్యత ఆధారంగా ట్రిబ్యునల్‌ నిర్దేశించిన నీటి పరిమాణాల ఆధారంగా సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. మినట్స్‌లో నమోదు చేసిన అంశాల్లో వాస్తవికత లోపించిందని ఈ అంశాలు పేర్కొంటున్నాయి. వాటిని సరిచేయాలి.  

కృష్ణా బోర్డు ప్రాథమిక బాధ్యతను మరిచింది... 
మిగులు జలాలపై హక్కులను కోరకుండా వాటిని వాడుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయించింది. దీని ఆధారంగా ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుత ఏపీలో అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. లేదా చివరి దశలో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం వంటి బేసిన్‌ లోపలి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోగా, వాటిని ప్రస్తుత ఏపీ అడ్డుకుంటోంది. 

కృష్ణా ట్రిబ్యునల్‌–1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నుంచి ఎస్‌ఆర్‌బీసీ, భీమా తదితర ప్రాజెక్టులకు పునఃకేటాయింపులు చేస్తూ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. ఈ ప్రాతిపదికనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ సమర్పిం చాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీకి విరుద్ధంగా కృష్ణా బోర్డు చేసిన వ్యాఖ్య ఏమాత్రం సరికాదు.  

మినట్స్‌ నుంచి తొలగించాలి  
టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణను చేపట్టేందుకు నిరాకరిస్తూ కృష్ణాబోర్డు మినట్స్‌లో పేర్కొన్న కారణాలు ఏమాత్రం సరికాదు. కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పు, రాష్ట్ర పునర్విభజన చట్టం–2014తో పాటు అపెక్స్‌ కౌన్సిల్, కృష్ణా బోర్డుల నిర్ణయాలకు విరుద్ధమని కృష్ణాబోర్డు పేర్కొంది. నీటి వినియోగాన్ని నియంత్రించడమే ప్రాథమిక బాధ్యత కలిగిన చట్టబద్ధ సంస్థ అయిన కృష్ణాబోర్డు ఇలాంటివి చెప్పకూడదు.  

తెలంగాణ వాదనలకు మినట్స్‌లో చోటు ఇవ్వలేదు  
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు తరలించుకోవడానికి ఏపీ చేసిన ప్రతిపాదనలు జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలతో పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సమావేశంలో తెలంగాణ నొక్కి చెప్పింది. ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తరహా వరద జలాల ఆధారిత ప్రాజెక్టులను మధించి అనుమతులు జారీ చేసేందుకు ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. ఈ విషయాన్ని మినట్స్‌లో సీడబ్ల్యూసీ నమోదు చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement