హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ఈవీఎంల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోదాంలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ సమీపంలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు. అనంతరం గోదాంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల నిల్వ గదులను పరిశీలించారు. భవన ప్రాంగణంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మొక్క నాటి నీరు పోశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాం నిర్మాణం ప్రధాన ఉద్దేశం ఈవీఎంలను సురక్షితంగా నిల్వ చేయడం, అన్ని భద్రతా ప్రమాణాలను పాటించడమేనని తెలిపారు. గోదాంలో 24 గంటలపాటు భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉంటాయని వివరించారు. అలాగే రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు ముందు మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల వివరాలను సరిచూసి వారి స్థానం గుర్తిస్తామన్నారు. ఈ ప్ర క్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి, బిహార్ అదనపు సీఈఓ ప్రశాంత్ కుమార్‌ను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్ బాబు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి


