న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మహబూబాబాద్: ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ సరెండర్ చేసినా ఆ కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బందిలో ఏమాత్రం మార్పు లేదు. ఎక్కువమంది అధికారులు, సిబ్బంది ఇతర పట్టణాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. గత నెల 31న కలెక్టర్ పీఆర్ ఈఈ కార్యాలయాన్ని సందర్శించారు. ఎక్కువ సమయం కేటాయించి అన్ని పరిశీలించారు. నిర్వహణపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిత్యం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఈనెల 4వ తేదీన ముగ్గురు అధికారులు మినహా ఎవరూ కూడా 11గంటలలోపు కార్యాలయానికి రాలేదు.
జిల్లా కేంద్రంలో పీఆర్ ఈఈ కార్యాలయం..
జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో 21మంది సిబ్బంది పని చేస్తున్నారు. స్టాఫ్ కాక ఈఈ కార్యాలయంలో ఈఈ, ఏడుగురు డీఈలు, 18మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయ పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. అలాగే ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఒక డీఈ, ఇద్దరు ఏఈలు, డీఎం, యూడీసీ, ఇద్దరు అటెండర్లు పని చేస్తున్నారు. డీఈ కార్యాలయ పరిధిలో మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి.
31న కలెక్టర్ సందర్శన..
ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గత నెల 31న కలెక్టర్ స్నేహ శబరీష్ పీఆర్ ఈఈ కార్యాలయం సందర్శించారు. కాగా ఆ కార్యాలయంలో నిర్వహణపై తదితర విషయాలపై అఽధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా అధికారులు, సిబ్బందిలో మార్పు రాలేదు.
ఈనెల 2న ఈఈ సరెండర్
పీఆర్ ఈఈగా పని చేసిన విద్యా సాగర్‌ను ఈనెల 2 పీఆర్ ఆర్‌డీకి కలెక్టర్ సరెండర్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం జీపీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, వీఓ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ రూ.49 కోట్లు కేటాయించింది. కాగా, వాటిలో రూ 4.50 కోట్ల బిల్లులు ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఆ నిధులు మిగలడంతో పాటు పలు కారణాలతో సరెండర్ చేసినట్లు సమాచారం .
పూర్తి కాని పనులు..
ఉపాధి హామీ నిధులతో 22 జీపీ భవనాలు మంజూరు కాగా.. కేవలం 14 వివిధ దశల్లో ఉండగా, 8 భవనాలు ప్రారంభం కాలేదు. అంగన్‌వాడీ భవనాలు 30మంజూరు కాగా.. 23 వివిధ దశల్లో ఉన్నాయి. ఏడు భవనాల పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు చాలా వరకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆ పనుల నిధులు, వాటి బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యంతో ఈఈపై వేటు పడింది. అలాగే వీఓ భవనాలు 180 మంజూరు కాగా.. వాటిలో 9 వివిధ దశల్లో ఉండగా, మిగిలినవి పనులు ప్రారంభం కాలేదు.
అయినా మారని సిబ్బంది..
కలెక్టర్ సందర్శన, ఈఈ సరెండర్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈనెల 4న ఇన్‌చార్జ్ ఈఈ ఆదిత్య రాజ్ మాత్రమే సమయానికి హాజరయ్యారు. అలా గే ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఇద్దరు మహిళా ఉద్యోగులు మాత్రమే హాజరయ్యా రు. చాలామంది సిబ్బంది వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంటర్‌సిటీ రైలు లో వస్తున్నారు. దీంతో వారు ఆలస్యంగా ఉదయం 11.30 గంటలు కార్యాలయానికి చేరుకుంటున్నారు.
ఆవేదన..
ఈఈని సరెండర్ చేసిన తర్వాత అదేరోజు రాత్రి ఇన్‌చార్జ్ ఈఈ బాధ్యతలను కార్యాలయంలో డీఈ టెక్నికల్‌గా పని చేస్తున్న ఆదిత్యరాజ్‌కు అప్పగించారు. దీంతో మిగిలిన డీఈలు సీనియారిటీ ప్రకారం బాధ్యతలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గైడ్‌లైన్స్ పాటించలేదని అంటున్నారు.
మిగిలిన శాఖల్లో వణుకు..
ఈఈని సరెండర్ చేసిన తర్వాత మిగిలిన శాఖల అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఆకస్మిక తనిఖీలు, 99 రోజుల పాలనలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలు పూర్తి చేయని వారిలో, బిల్లుల క్లియరెన్స్ నిధుల విషయంలో తేడాలు ఉన్న వారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, కలెక్టర్ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పీఆర్ ఈఈ సరెండర్
అయినా అధికారులు,
సిబ్బంది నిర్లక్ష్య వైఖరి
సమయపాలన పాటించని వైనం
బాధ్యతల కేటాయింపులో
సీనియర్ల అసంతృప్తి


