‘లిఫ్ట్‌’ ప్లీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

‘లిఫ్ట్‌’ ప్లీజ్‌..

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలంటున్న ప్రయాణికులు

డోర్నకల్‌: డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని 2, 3, 4వ నంబర్‌ ప్లాట్‌ఫాంలపైకి ప్రయాణికులు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. విజయవాడ, కొత్తగూడెం వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్‌ వైపు వెళ్లే కొన్ని రైళ్లు 2, 3, 4వ ప్లాట్‌ఫాంలపైకి వస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తప్పనిసరిగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మీదుగా ఈ ప్లాట్‌ఫాంలపైకి వెళ్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మెట్లు ఎక్కడం, దిగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిఫ్ట్‌, పాత్‌ వే, ఎస్కలేటర్‌ సౌకర్యం లేకపోవడంతో తప్పనిసరిగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లగేజ్‌, చంటి పిల్లలతో సకాలంలో రైలును అందుకునేందుకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మెట్లు ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన సమయంలో బ్రిడ్జిపై నీరు చేరి ప్రయాణికులు జారిపడిన సందర్భాలు ఉన్నాయి.

రైలు ఎటొస్తుందో తెలియదు..

వరంగల్‌ వైపు వెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణా, ఇంటర్‌సిటీ లాంటి రైళ్లు ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం పైకి రావాల్సి ఉంది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి అవసరం లేకుండా నేరుగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం పైకి వెళ్లవచ్చు. అయితే ప్రతీరోజు ఆ రైళ్లు వచ్చే సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై గూడ్స్‌ రైళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో ఆయా రైళ్లు రెండు లేదా మూడో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వస్తున్నాయని మైక్‌లో అనౌన్స్‌ చేయడంతో ప్రయాణికులు పిల్లలు, లగేజ్‌తో హడావుడిగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మీదుగా అవతలి ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్‌ వైపు వెళ్లే చాలా మంది ప్రయాణికులు రైలు ఏ ప్లాట్‌ఫారంపైకి వస్తుందో తెలియక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై కూర్చుని రైలు కోసం వేచి చూస్తున్నారు. విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెం వైపు వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మీదుగా స్టేషన్‌ లోపలికి వెళ్లాలి. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఎక్కలేని కొంతమంది ప్రయాణికులు 2, 3ప్లాట్‌ఫాంలకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెందిన పడిన ఘటనలు చాలా ఉన్నాయి. కాగా, డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో ఒకటి, మూడో ప్లాట్‌ఫాంలపై లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. లిఫ్ట్‌ల ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement