జిల్లాల వారీగా వ్యక్తిగత వాహనాల వివరాలిలే..
వాహన్ పోర్టల్ సేవలు పక్కాగా అమలు
ఖిలా వరంగల్ : వాహన వివరాలు ఇక నుంచి వాహన్ పోర్టల్‌లో కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వాహనాలు, లైసెన్సులు తదితర సేవలను వాహన్ పోర్టల్‌లో అందిస్తుండగా.. హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సోమవారం వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ డీటీసీ సురేశ్‌రెడ్డి పర్యవేక్షణలో వాహన షోరూంలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. గతంలోనే వాహన్ పోర్టల్‌పై షోరూంల యజమానులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయితే వాహన దారులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి.
సేవలు అందేదిలా..
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొ చ్చిన వాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందనున్నాయి. ప్రధానంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలు, ఎన్‌ఓసీలు, ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, ఇంజిన్ ఛాసిస్ నంబర్‌వంటి సమాచారం ఈపోర్టల్ ద్వారా అందుతాయి. ఇక నుంచి పూర్తి పారదర్శకంగా సేవలు నమోదవుతాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాహన వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించిన పక్షంలోనూ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కూర్చున్న చోట నుంచే తేలికగా ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసుకునే అవకాశం దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ షోరూం సోమవారం ఈపోర్టల్‌కు అనుసంధానమైంది. తద్వారా ఏ రోజు విక్రయించిన వాహనాలు ఆ రోజే పోర్టల్‌లో నమోదవుతాయి. ఇదే క్రమంలో వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకులను అనుసంధానం చేశారు. ఈప్రక్రియతో బోగస్ ఫైనాన్స్ సంస్థల ఆటకు అడ్డుకట్ట వేసినట్లైంది.
షోరూంల్లో పారదర్శకంగా సేవలు..
కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలన్నీ సోమవారం మధ్యాహ్నం వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అప్ డేట్ చేశారు. వాహన్ పోర్టల్ పూర్తి స్థాయిలో అమలుల్లోకి వచ్చింది. కొనుగోలు చేసిన చోట రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించింది.
జిల్లాలు ద్విచక్రవాహనాలు కార్లు / షోరూంలు
జీపులు
వరంగల్ 1,85,865 24,791 23
హనుమకొండ 2,16,234 48,513 26
జనగామ 61,036 8,537 12
జేఎస్ భూపాలపల్లి 95,681 11,258 7
ములుగు 4,433 3,767 2
మహబూబాబాద్ 1,23,103 9,096 17
ప్రారంభించిన రవాణాశాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్
అన్ని షోరూంల్లో ఇకనుంచి
లాంఛనంగా అమల్లోకి
ఆర్టీఏ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..
దేశవ్యాప్తంగా ఒకే విధానం
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ పోర్టల్ సేవలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇక నుంచి షోరూంల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలందుతాయి. ఎలాంటి జాప్యం ఉండదు.
– సురేశ్‌రెడ్డి, డీటీసీ, వరంగల్


