హన్మకొండ: కొందరు అధికారుల తీరుతో టీజీ ఎన్పీడీసీఎల్ పరువు మసకబారుతోంది. నవ్విపోదురు కాక నాకేంటి అన్న చందంగా టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఓ సీనియర్ అధికారి తీరు ఉంది. అక్రమాలు నియంత్రించాల్సిన సదరు అధికారి తానే దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో దిట్ట అయిన ఆ అధికారి చివరకు సబ్ స్టేషన్ బోరు నీటిని కూడా వదలడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య ఇంజనీర్ నిర్వాకం సంస్థ పరువు తీసేలా ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పంట పొలాలకు సబ్‌స్టేషన్ బోరు నీరు..
33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో సబ్ స్టేషన్, సి బ్బంది అవసరాల కోసం ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బోరు తవ్వించి విద్యుత్ మోటారు బిగించింది. ఇదే విద్యుత్ స్టేషన్‌కు సమీపంలో టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య అధికారితో పాటు సమీప బంధువుల పంట పొలాలున్నాయి. ఈ పంట పొలాలకు ఈ ముఖ్య అధికారి తన అధికారంతో బోరు నీటిని అక్రమంగా వాడుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
సంస్థ నిధులతోనే బోరుకు మరమ్మతు..
టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దేవోజీ తండాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించింది. ఇదే సమయంలో సబ్ స్టేషన్, సిబ్బంది నీటి అవసరాల కోసం బోరు తవ్వించి మోటారు బిగించింది. ఈ బోరు నుంచి సదరు ముఖ్య అధికారి అక్రమంగా సాగు నీటి అవసరాలు తీర్చుకుంటున్నాడని విద్యుత్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్న ఏ ఒక్కరూ నియంత్రించడం లేదని విద్యుత్ ఉద్యోగ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బోరు మోటారు మరమ్మతుకు వస్తే బాగు చేయించే వరకు క్షేత్ర స్థాయి అధికారిని సదరు అధికారి తీవ్రంగా వేధించే వారనే ఆరోపణలున్నాయి. తన సొంత పొలానికి సాగు నీటిని వాడుకుంటూ మోటారు పాడైతే కూడా క్షేత్ర స్థాయి అధికారిని బెదిరించి సంస్థ నిధులతో బాగు చేయించి తన సాగు నీటి అవసరాలు తీర్చుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు కోకొల్లలు. దీనిపై యాజమాన్యం స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
దుర్వినియోగానికి పాల్పడుతున్న
టీజీ ఎన్పీడీసీఎల్ అధికారి
సాగు నీటి అవసరాలకు సబ్ స్టేషన్ బోరు వాడుకుంటున్న వైనం


