రేపు ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14,17 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు భీమారం సమీపంలోని కిట్స్ కళాశాలలో ప్రారంభమయ్యే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు రజినీకాంత్ 93910 29491, పార్థసారథి 98497 60799 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ముగిసిన ‘సర్జన్స్’
రాష్ట్రస్థాయి సదస్సు
ఎంజీఎం: నగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. కాళోజీ క్షేత్రంలో నిర్వహించిన ముగింపు సదస్సులో లాప్రోస్కోపి శస్త్రచికిత్సలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్జన్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి కేఎంసీ పోస్టు గ్రాడ్యుయేట్ విదార్థులు, సర్జన్ల కృషి ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న అతిథులతో పాటు సదస్సు విజయవంతం చేసిన వారిని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సదస్సులో సర్జన్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ మోహన్‌దాస్, కూరపాటి రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, నాగేందర్ పాల్గొన్నారు.
చిట్‌ఫండ్ యజమానిపై కేసు
కాజీపేట: కాజీపేట పట్టణంలో 30 మంది చిరు వ్యాపారుల నుంచి దాక్షాయణి చిట్‌ఫండ్ పేరుతో రూ.30 లక్షలు వసూలు చేసిన గుండ్ల శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఎస్సై నవీన్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హనుమకొండకు చెందిన గుండ్ల శ్రావణ్‌కుమార్ ఫైనాన్స్ సంస్థను స్థాపించి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. పది రోజులుగా శ్రావణ్‌కుమార్ డబ్బుల కోసం రాకపోవడంతోపాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో బాధితులు ఇంటి వద్దకు వెళ్లగా ఆచూకీ లభించలేదు. బాధితులతో కలిసి వచ్చి బుడిమే రమేశ్ ఫిర్యాదు చేయగా శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
14న బహిరంగ వేలం
పాలకుర్తి టౌన్ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్కు కోసం (అభిషేకం, వాహనపూజ సామగ్రి మినహాయించి) తలనీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 13న సాయంత్రం 5 గంటలోపు బుకింగ్ కార్యాలయంలో రూ. 1000 చెల్లించి టెండర్ షెడ్యూల్ పొందాలని కోరారు.
రేపు ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు


