నకిలీ బంగారం ముఠా అరెస్ట్
కాటారం: మండల కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్ యజమానికి నకిలీ బంగారం అంటగట్టి ఆర్థికంగా మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులతో కూడిన ముఠాను అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి కాటారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పుణ్య బాలచంద్ రాథోడ్, మీనాపుణ్య రాథోడ్, కారేగావ్‌కు చెందిన శాంతివిజయ సోలంకి, స్వప్నఈశ్వర్ సోలంకి జల్సాలకు అలవాటు పడి చోరీలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం ఐదుగురు ముఠా సభ్యులు కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ సూపర్ మార్కెట్ యజమాని వద్దకు వెళ్లి తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపారు. దీంతో సదరు దుకాణం యజమాని కొంత నగదు చెల్లించి బంగారం తీసుకోగా నకిలీ అని గుర్తించాడు. మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఈ ముఠా సభ్యులు కాటారం మండల పరిధిలోని నస్తూర్‌పల్లి సమీపంలో ఓ వ్యక్తిని బెదిరించి దాడి చేసి దారి దోపిడీకి పాల్పడినట్లు ఫిర్యాదు ఉంది. దీంతో జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి చింతకాని గ్రామశివారులో ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు మహిళలు మేడారం వైపునకు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నకిలీ బంగారం అంటగట్టి సూపర్ మార్కెట్ యజమానిని మోసం చేయడంతోపాటు వ్యక్తిపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడినట్లు సదరు నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.3.48 లక్షల నగదుతోపాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. కేసును అత్యంత ప్రతిభతో ఛేదించిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు శ్రీనివాస్, మహేశ్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుళ్లు రాజు, నాగరాజు, రామారావు, జంపన్న, ఐటి కోర్ వేణును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి వాటి బారినపడి మోసపోవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.
రూ.3.48 లక్షల నగదు,
6 సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
కాటారం డీఎస్పీ సూర్యనారాయణ


