జనగామ ఫ్లైఓవర్‌పై రిటైర్డ్ హెచ్‌ఎం..
జనగామ రూరల్: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ మృతి చెందాడు. ఈ ఘటన జనగామలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన భూపల్లి నతాని యేలు(65) జనగామ ప్రిస్టన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఈక్రమంలో ఆదివారం బైక్‌పై ఫ్లై ఓవర్‌పై వస్తున్న క్రమంలో మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యేలును జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామంలో యేలు అంత్యక్రియలు జరగనున్నట్లు ప్రిస్టన్ స్కూల్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడి మృతిపై పూర్వ విద్యార్థులతో పాటు జనగామ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
బుర్హాన్‌పురం సమీపంలో యువకుడు..
మరిపెడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుర్హాన్‌పురం సమీపంలోని జాతీయ రహదారి –365పై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన రాములు బుర్హాన్‌పురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు బంధువు ఇంటికి వెళ్లారు. బుర్హాన్‌పురం గ్రామం నుంచి ఇద్దరు ద్విచక్రవాహనంపై మరిపెడ మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన రాములును 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.


