
రేపు జాబ్‌మేళా
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈనెల 20న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాబ్‌మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని, దాదాపు 500 ఖాళీలకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హతగల అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఉదయం 9.30గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లామా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు బయో డేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
రేట్లు పెంచే వరకూ
సమ్మె సాగిస్తాం
నెహ్రూసెంటర్: విద్యుత్ కాంట్రాక్టర్ల రేట్లు పెంచే వరకూ సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందు సైదులు అన్నారు. గురువారం సమ్మె మూడో రోజుకు చేరగా విద్యుత్ పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేట్లు పెంచడంతో పాటు పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు చెల్లించేలా విద్యుత్ సంస్థ, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజులుగా పనులను నిలిపివేసి సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, జిల్లా ఎస్‌ఈ, సీఎండీ చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్లు కుమార్, రాంబాబు, నజీర్, బాలాజీ, విశ్వేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, కిశోర్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు పోషణ
అందించడమే లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: ఐదేళ్లలోపు చిన్నారులకు పోషణ అందించడమే లక్ష్యమని డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో గురువారం అంగన్‌వాడీ టీచర్లకు మూడురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లలందరికీ పౌష్టికాహారం, మంచి విద్య అందించాలన్నారు. నూతనంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పేర్లను అంగన్‌వాడీల్లో నమోదు చేయాలన్నారు. చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్‌వాడీ సెంటర్లు చేస్తున్న సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.సూపర్‌వైజర్లు పద్మావతి, విజయలక్ష్మి, సులోచన, కాట రోజ, పద్మ, పద్మావతి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి నేషన్‌ల్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ (ఎన్‌ఎంఎంఎస్)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దక్షిణామూర్తి గురువారం తెలిపారు. విద్యార్థులు ఏడో తరగతిలో 55 శాతం మార్కులు సాధించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. పరీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. అక్టోబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
19న సైన్స్ డ్రామా పోటీలు..
జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు ఈ నెల 19న మానుకోట మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ దక్షిణామూర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సైన్స్, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, గ్రీన్ టెక్నాలజీ అనే అంశాల్లో సైన్స్ డ్రామా పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావును ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంప్రదించాలన్నారు.
రామప్పలో సింగపూర్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సింగపూర్‌కు చెందిన దెవ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని సైతం దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని దెవ్ కొనియాడారు.