జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’ | - | Sakshi
Sakshi News home page

జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’

Sep 19 2025 3:02 AM | Updated on Sep 19 2025 3:02 AM

జీపీ

జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’

మహబూబాబాబాద్‌: జిల్లాలో మేజర్‌ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే అప్‌గ్రేడ్‌పై శ్రద్ధపెట్టిన ప్రజాప్రతినిధులు నూతన భవన నిర్మాణాలపై పెట్టడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి గ్రామ పంచాయతీ భవనాల్లో మున్సిపల్‌ కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సరిపడా గదులు లేక అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు సరిపోను సిబ్బంది లేక అవస్థలు తప్పడం లేదు.

ఐదు మున్సిపాలీటీలు జీపీ భవనాల్లోనే..

జిల్లాలో మానుకోట, మరిపెడ, డోర్నకల్‌, తొర్రూ రు మున్సిపాలిటీలతో పాటు ఇటీవల కేసముద్రం కూడా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. కాగా, ప్రస్తుతం అన్ని కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. తొర్రూరులో 16 వార్డులు, 19,100 జనాభా, మరిపెడలో 15 వార్డులు, 17,875 మంది జనాభా, డోర్నకల్‌లో 15వార్డులు 14,425 మంది జనాభా ఉంది. కేసముద్రం మున్సిపాలిటీని జనాభా ఆధారంగా 16 వార్డులుగా అధికారులు నిర్ణయించినప్పటికీ.. అధికారికంగా వార్డుల విభజన పూర్తి కాలేదు.

2018లోనే శంకుస్థాపన..

పురపాలక అభివృద్ధి నిధుల నుంచి 2018లో మానుకోట మున్సిపాలిటీ భవనానికి రూ.5కోట్లు కేటాయించారు. కాగా అనంతారం రోడ్డులో 2018 ఏప్రిల్‌ 4వ తేదీన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ నేటి వరకు పనులు పూర్తి కాలేదు. 80శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. జీప్లస్‌ వన్‌ భవన నిర్మాణ పనులు చేపట్టగా.. ప్లాస్టింగ్‌, టైల్స్‌ ఇతర పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం జీపీ భవనంలోనే మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.

వెంటాడుతున్న సిబ్బంది కొరత..

మానుకోట మున్సిపాలిటీకి ఆఫీస్‌ స్టాఫ్‌ ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. కాగా వార్డు ఆఫీసర్లు ఇతర సిబ్బంది సమావేశ మందిరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే పారిశుద్ధ్య సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో సంఖ్య పెంచాలని పలు మార్లు సీడీఎంఏకు వినతులు ఇచ్చారు. కానీ నూతన సిబ్బందిని తీసుకోలేదు. మరిపెడలో కమిషనర్‌ ఇతర రెగ్యులర్‌ స్టాఫ్‌ ఉండగా టీపీఎస్‌, టీపీఓ, ఏఈ లేకపోవడంతో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. తొర్రూరులో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఇద్దరు లేకపోవడంతో వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లు పని చేస్తున్నారు. డోర్నకల్‌లో టీపీఎస్‌, ఏఈ లేరు. వారి స్థానంలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఇతర సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. కేసముద్రం మున్సిపాలిటీకి మానుకోట కమిషనర్‌ రాజేశ్వర్‌, టీపీఓ సాయిరాం, టీపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏఈ కుమార్‌ ఇన్‌చార్జ్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం డిప్యుటేషన్‌పై వార్డు ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పని చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

బిల్లులు రాకనే పనులు

నిలిచిపోయాయి

మానుకోట మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం కేవలం బిల్లులు రాకనే నిలిచిపోయింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదల కాగానే వెంటనే పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. ఆ భవనం పూర్తి అయితే పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సిబ్బందికి ఏ సమస్య ఉండదు.

–టి.రాజేశ్వర్‌,

మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌

కార్యాలయాల్లో గదులు సరిపోక అధికారుల ఇబ్బందులు

ప్రతిపాదనలకే పరిమితమైన

నూతన భవనాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

భవనాల మంజూరే లేదు..

మరిపెడ మున్సిపాలిటీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం స్థలంలోనే నిర్మాణం చేయడానికి నిర్ణయించారు. టెండర్‌ పూర్తయింది.. కానీ నిధులు రద్దు కావడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు పేర్కొన్నారు.

డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

ఇటీవల మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన కేసముద్రం కార్యాలయం కూడా జీపీ భవనంలోనే కొనసాగుతోంది. ఆ మున్సిపాలిటీకి నిధులు మంజూరు అయ్యా యి. ఆ నిధుల నుంచి కార్యాలయ భవన నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.

జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’ 1
1/1

జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement