
అవకతవకలు.. నిర్లక్ష్యం!
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
● ఐదు పీఏసీఎస్ పాలకవర్గాలపై వేటు
● రుణాల చెల్లింపుల్లో నిర్లక్ష్యమే
ప్రధాన కారణం
● పర్సన్‌ఇన్‌చార్జ్‌ల నియామకం
మహబూబాబాద్ రూరల్/తొర్రూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీకా లాన్ని ప్రభుత్వం ఇటీవల ఆరు నెలల పాటు పొడిగించింది. కానీ నిధుల దుర్వినియోగం, రుణా ల చెల్లింపులో నిర్లక్ష్యం, డైరెక్టర్లు డిఫాల్టర్లుగా మా రిన కారణంగా జిల్లాలోని ఐదు సొసైటీల పాలకవర్గాలపై వేటు వేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం పీఏసీఎస్‌లు, కురవి రైతు సహకార పరపతి సంఘం పాలకమండళ్ల పదవీకాలం పొడిగించలేదు. జిల్లాలో మొత్తం 18సహకార పరపతి సంఘాలు ఉండగా ఐదు సంఘాల పాలకమండళ్లను రద్దు చేసి పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ జిల్లా సహకారశాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అవకతవకలు..
సొసైటీల పరిధిలోని గ్రామాల రైతుల(సభ్యులు)కు రుణాలు ఇవ్వడం, ఎరువులు అందించడం వంటి సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సొసైటీల పాలకమండళ్లు నిర్వహణ ఖర్చుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు కార్యదర్శులు(సీఈఓ)లు కూడా సహకరించడంతో పలుచోట్ల వేటువేశారు. ఇదే సమయంలో ఐదు సొసైటీల పాలకవర్గాలు రద్దయ్యాయి. నిధుల దుర్వినియోగం, రుణాల చెల్లింపుల్లో నిర్లక్ష్యం, డిఫాల్టర్లయిన డైరెక్టర్లను చూపుతూ వేటు వేశారు. అంతేగాక పలు సంఘాలు నష్టాల్లో ఉన్నట్లు చూపారు. ఐదు సొసైటీలు ఆరు మాసాల పాటు పర్సన్ ఇన్‌చార్జ్ పాలనలో కొనసాగనున్నాయి.
కారణాలివే..
● తొర్రూరు పీఏసీఎస్‌లో ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, రుణాల రికవరీ, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా 2024–25లో సిబ్బంది ఖర్చులు 30 శాతానికి మించి, నిర్వహణ వ్యయం 20 శాతానికి మించి ఉండడం వంటి కారణాలతో పాలకమండలిని రద్దుచేసినట్లు తెలిసింది.
● నెల్లికుదురులో పీఏసీఎస్ పాలకవర్గ ప్రతినిధులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారు. రూ.24, 47,844 రుణాలుగా పొంది సకాలంలో చెల్లించనందువల్లే పాలకమండలిని రద్దుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
● కురవి కర్షక సేవా సహకార సంఘం మూడేళ్లుగా నష్టాల్లో ఉన్నట్లు చూపారు.
● కేసముద్రం సొసైటీలో రుణాల రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లలో లెక్కలు సరిగా చూపించకపోవడం, 2021–22 నుంచి 2023–24 వరకు ఆడిట్ నివేదికలో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాలతో పాలకమండలిపై వేటు వేసినట్లు తేలింది.
● బయ్యారం సొసైటీలో రూ.3.24 కోట్ల బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2019–20, 24–25లో సొసైటీ నిర్వహణలో రూ.28.30 లక్షల తేడా ఉన్నట్లు తేలింది. 2024–25లో రూ.33 లక్షల నష్టం వచ్చిన విషయంలో కారణాలు చూపలేదు. ఎరువుల విక్రయాల లెక్కల్లో రూ.54.37లక్షల తేడా ఉన్నట్లు తేలింది. డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించలేదు.
ప్రతిపక్ష నాయకులు చైర్మన్లుగా ఉండడమే కారణమా?
ఐదు సొసైటీల పాలకవర్గాలను రద్దు చేయడానికి బీఆర్‌ఎస్ నేతలు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉండడం కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసముద్రం చైర్మన్ ధీకొండ వెంకన్న, కురవి కర్షక సేవా సహకార సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, నెల్లికుదురు సొసైటీ చైర్‌పర్సన్ కాసం లక్ష్మి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో సొసైటీలను రద్దు చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయనకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి పొసగడం లేదు. దీంతో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నాడు. బయ్యారం చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలు, అవకతవకలు రద్దుకు కారణమయ్యాయని పేర్కొంటున్నారు. దీంతో పాటు మెజారిటీ డైరెక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీకే చెందిన వారే కావడం, స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలే పాలకమండళ్లను రద్దు చేసినట్లు చర్చించుకుంటున్నారు.