
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
కురవి: పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలురు, బాలికల వసతి గృహాలను, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్, పరిసరాలను పరిశీలించారు. చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కిచెన్, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, తాగునీరు, తదితర వాటిని తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించి వంట మనుషుల అనుభవం, భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజ నం అందించాలన్నారు. జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్య, హాజరును పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి,విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులను ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పడంతో అభినందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం జాగ్రత్తలు తెలిపారు. చదువుతోపాటు క్రీడలను నేర్పించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. కార్యక్రమంలో సీరోలు తహసీల్దార్ పున్నంచందర్, ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్‌సోని, హెచ్‌ఎం బంగారి, ఆర్‌ఐలు సుమతి, శ్రావణి, గ్రామ పాలన అధికారి వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.