
ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగుచేసి తమ ఆదాయం రెట్టింపు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు యాకాద్రి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కేవీకే నిర్వహిస్తున్న ప్రథమ శ్రేణి ప్రదర్శనలు, క్షేత్ర దినోత్సవాలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాల గురించి శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. వరి విత్తనోత్పత్తి, వివిధ ప్రాజెక్టులు, కేవీకే రైతులకు అందిస్తున్న విషయ సమాచారం, వాతావరణ సమాచారం, యాంత్రీకరణ పద్ధతులపై పరిశీలన చేశారు. జిల్లాలో ప్రధానంగా సాగవుతున్న ప్రధాన పంటల గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ముఖ్య ంగా పంట మార్పిడి అలవాటు చేసుకోవాలని, పప్పు, నూనెగింజల పంటల సాగు వైపునకు మొగ్గుచూపాలని సూచించారు. ఒకే పంటను వానాకాలం, యాసంగిలో సాగు చేయకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, ఉద్యాన, గృహ విజ్ఞానంలో కూడా మెళకువలు తెలుసుకోవాలన్నారు. రైతులు వీలైనంత మేరకు యూరియా వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంచుకోవాలన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని సూచించారు. అనంతరం కురవి రైతు మేక వెంకటరెడ్డి రైతు క్షేత్రంలో అధిక సాంద్రత పద్ధతి పత్తిపంట సాగును సందర్శించారు. కార్యక్రమంలో మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, సుహాసిని, దినేష్, శేఖర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.