
రైల్వే సమస్యలు పరిష్కరించాలి
● కేంద్ర మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి
కాజీపేట రూరల్ : న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో బస్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణ, కాజీపేట అమృత్ భారత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం కాజీపేట బస్‌స్టేషన్ ఆవశ్యకతపై రైల్వే మంత్రికి వివరించి, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించారని, ప్రజారవాణా దృష్ట్యా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి ఆ అంశాలను పరిశీలించి నివేదికలు పంపించాలని అధికారులకు చెప్పారని ఎమ్మెల్యేలు తెలిపారు.
ఆటోడ్రైవర్‌కు
ఏడాది జైలు
వరంగల్ లీగల్ : నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమమైన డ్రైవర్ మరుపట్ల తారయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ కోర్టు జడ్జి చింతాడ శ్రావణ స్వాతి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020, అక్టోబర్ 9న బీటెక్ విద్యార్థి బి.జశ్వంత్ బైక్‌పై హైదరాబాద్ నుంచి హనుమకొండ బయలుదేరాడు. మార్గమధ్యలో రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా జంక్షన్‌లో మడికొండ నుంచి వస్తున్న ఆటో నిర్లక్ష్యంగా కుడి వైపునకు ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియా వైపుగా మళ్లించడంతో బైక్‌కు తగిలింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, బైక్ నడుపుతున్న బి.జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో ఎంజీఎం తరలించారు. ఆటో డ్రైవర్ కాజీపేట రహమత్‌నగర్‌కు చెందిన మరుపట్ల తారయ్య అని తెలిసింది. అనంతరం జశ్వంత్ కుటుంబీకులు ఎంజీఎం వెళ్లేసరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శ్రావణ స్వాతి.. నేరస్తుడికి ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు సీఐ కిషన్, ఎస్సై కుమారస్వామి, పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్‌గా పరమేశ్వరి, కుమారస్వామి విచారణ పర్యవేక్షించారు. కానిస్టేబుల్ వీరగోని రాజేశ్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.