
చేతిలోనే సమస్త సమాచారం..
ఖిలా వరంగల్: భారతీయ రైల్వే ప్రయాణికులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగా ట్రైన్‌లో ప్రయాణించాల్సిన వ్యక్తి ఇక నుంచి రైల్వే సేవలకు అటు ఇటు వెళ్లాల్సిన పనిలేదు. కావాల్సిన సమాచారమంతా కూర్చున్న చోటు నుంచే తెలుసుకునేలా అనేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల ద్వారా ప్రయాణికులకు క్షణాల్లో మెరుగైన సేవలు అందుతాయి. దీనికి కావాల్సింది చేతితో స్మోర్ట్ ఫోన్ మాత్రమే. ఈ క్రమంలో ఈ రైలు యాప్‌లు ఎలాంటి సేవలు అందిస్తాయి.. ఎలా పొందాలనే అంశాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం
టికెట్‌కు ఇబ్బంది లేదు..
యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.అంతేకాదు అత్యవసరంగా అన్ రిజర్వుడ్ టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందొచ్చు. అలాగే, యాప్‌ల ద్వారా సాధారణ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, నెలవారీ టికెట్, క్యాన్సలేషన్, టికెట్ హిస్టరీ, బుకింగ్ టికెట్ సమాచారం, ఆర్.వాలెట్, టికెట్ ప్రొఫైల్, టికెట్ ట్రాన్జాక్షన్, రైల్ లైవ్ లోకేషన్ మొత్తం యాప్‌ల ద్వారా సులభంగా తెలుసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
రైళ్ల కోసం..
ఈ యాప్‌ల సేవలు అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్ వన్, యూటీఎస్ యాప్‌ల ద్వారా వెళ్లాల్సిన ప్రాంతం, ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రైన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్‌పైకి రైలు వస్తుంది, కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది.. ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
రిజర్వేషన్ స్థితి..
ఈయాప్‌ల్లో టికెట్ రిజర్వేషన్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ స్థితి, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలు, రిజర్వేషన్ రద్దు, తదితర అంశాలనూ తెలుసుకోవచ్చు.
సీటు వద్దకే ఆహారం..
రైలు ఎక్కగానే ప్రయాణికులకు ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ముందే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే రైలులో సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తారు.
సూచనలు, ఫిర్యాదులు..
ఏమైనా సూచనలు ఇవ్వాలనుకున్నా.. రైళ్లలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదులు చేయడానికి రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కాగా, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 8వేలకు పైగా మంది ప్రయాణిస్తుంటారు. ఫలితంగా ప్రతీ రోజు రైల్వేశాఖకు రూ.6లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కూర్చున్న చోటే క్షణాల్లో వివరాలు
అందుబాటులో రైల్‌వన్,
యూటీఎస్ యాప్‌లు
రైల్వే సమాచారం కోసం ఇక నుంచి ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు
డౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి..
ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజస్ట్రేషన్ చేసుకుని పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది.

చేతిలోనే సమస్త సమాచారం..

చేతిలోనే సమస్త సమాచారం..