
రీజన్స్ లేకుండా రిజెక్టు చేయొద్దు..
జనగామ: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే కారణం లేకుండా రిజెక్ట్ చేయొద్దని.. ఒక వేళ చేసినా కారణం చెప్పాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహిసినపర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. డీసీపీ రాజమహేంద్రనాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఘనస్వాగతం పలికింది. అనంతరం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల కోరిన మేరకు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆర్టీఐకి ఎప్పుడూ భయపడొద్దన్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం కోరిన 30 రోజుల వరకు సమయం ఉంటుందని, కారణం చూపకుండా గడువు దాటితే సంబంధిత అధికారి నుంచి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే అప్పీల్‌కు వెళ్లొచ్చన్నారు. గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే స్టేట్ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్తుందని, మొదటి అప్పీల్ జిల్లా అప్పీలేట్, రెండో అప్పీల్ స్టేట్ కమిషన్ వద్దకు వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుడు నష్టపోతే ఆ పరిహారాన్ని పీఐఓలు భరించాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో సహచట్టం ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతో తీసుకొచ్చారో, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని చెప్పారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కుచట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మూడు, ఆరు నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి సలహాలు, సూచనలు అందించారు.
అధికారులు ఆర్టీఐకి భయపడొద్దు
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి