
చావులోనూ వీడని బంధం..
దుగ్గొండి : 60 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అన్యోన్య దంపతులుగా జీవనం గడిపారు. పిల్లలందరూ ఎవరికివారు బతుకుతున్నారు. కొంత కాలంగా వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి భర్త మనోవేదనకు గురవుతూ గురువారం కన్నుమూశాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోశాల యాకయ్య, సారమ్మ (75) దంపతులు. సారమ్మ పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి యాకయ్య (80) మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సారమ్మ దశదిన కర్మ అనంతరం మరుసటి రోజు యాకయ్య తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరణంలోనూ యాకయ్య, సారమ్మ దంపతుల బంధం వీడలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రాజేందర్, కృష్ణమూర్తి ఉన్నారు.
పది రోజుల వ్యవధిలో దంపతులు మృతి
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు