
కుక్క అడ్డొచ్చి ఆటో బోల్తా..
న్యూశాయంపేట: వరంగల్ దూపకుంట రోడ్డులోని గిరిప్రసాద్ నగర్ వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో బాలికల మైనారిటీ గురుకులంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టీజీటీ ఉర్దూ టీచర్‌గా పనిచేస్తున్న అజ్మీరీబేగం(38) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దూపకుంట రోడ్డులోని మైనారిటీ బాలికుల గురుకులంలో పనిచేస్తున్న ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల సమయం పూర్తికాగానే ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో మహిళ కూడా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో గిరిప్రసాద్‌నగర్ వద్దకు రాగానే కుక్క ఆటోకు అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. కాగా, డ్రైవర్ పక్కన కూర్చున్న అజ్మీరీ బేగానికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్‌కు తీవ్ర, నలుగురు టీచర్లు, మరో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఎంజీఎం, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.
● గురుకుల ఔట్‌సోర్సింగ్ టీచర్ మృతి
● డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురికి గాయాలు