
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టం చేయాలి
హన్మకొండ : బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గద్దర్ స్ఫూర్తిని ఈతరం కొనసాగించాలన్నారు. దేశ సాంస్కృతిక చరిత్రలో గద్దర్‌ది చెరగని స్థానమని, ఆయన జీవించి ఉన్నంత కాలం ప్రజల కోసమే పాటుపడ్డారన్నారు. తొలి రోజుల్లో బుల్లెట్‌ను నమ్ముకున్న గద్దర్.. తర్వాత అంబేడ్కర్ మార్గంలోకి వచ్చి బ్యాలెట్‌ని నమ్మారన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినా తన వర్గానికి కాకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ముస్లింలను చూపిస్తూ కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ పోరాటం చేసిన స్వాగతిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన గద్దర్ కృషి మరువలేనిదన్నారు. గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ వరంగల్‌తో పాటు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడ రంజిత్ కుమార్, కాడపాక రాజేందర్, రామంచ శ్రీను, ప్రొఫెసర్ వీరస్వామి, ఆస్నాల శ్రీనివాస్, బండి మొగిలి, సాయిని నరేందర్, టి.ఎన్.స్వామి, మన్నే బాబురావు, రామంచ భరత్, తాళ్ల సునీల్ పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య