
మెరుగైన విధానాలు అమలు చేయాలి
మహబూబాబాద్: విపత్తుల నిర్వహణలో మెరుగైన విధానాలను అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం( ఎన్‌డీఆర్‌ఎఫ్) చేపట్టే కార్యక్రమాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల నిర్వహణ, తక్షణ చర్యలు, సహాయ కార్యక్రమాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వరదలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విపత్తు సమయంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం త్వరలో జిల్లాలో విపత్తు నిర్వహణపై మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో 20మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఈనెల 29 నుంచి ఆగస్టు 14వరకు మున్సిపాలిటీ పరిధి లోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్రకుమార్, ఏఎస్సై ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఈఓ రవీందర్ రెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్, అంగన్‌వాడీ టీచర్ ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్