
తగ్గిన పశు సంపద!
మహబూబాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద అత్యంత కీలకం. శాస్త్ర, సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ.. దేశంలో అధికశాతం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ అనేది కీలకంగా మారింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఐదేళ్లకోసారి పశు గణన చేపడుతోంది. దీనిలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన పశుగణన ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి కావాలి. కానీ చాలా ఆలస్యంగా ప్రస్తుతం పూర్తి చేశారు. కాగా ఐదేళ్లక్రితంతో పోలిస్తే పశువుల సంఖ్య తగ్గినట్లు సమాచారం.
45 పశువైద్యశాలలు..
జిల్లాలో మొత్తం 45 పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటిలో ఏరియా వెటర్నరీ వైద్యశాలలు (ఏవీహెచ్) 3, ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీవీసీ) 23, సబ్ సెంటర్లు 16 ఉన్నాయి. కాగా 2019లో పశుగణన చేశారు. అప్పుడు అన్ని రకాల పశువులు కలిసి 11,85,568 ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
తగ్గుదల..
జిల్లాలో గత గణనలో 11,85,568 పశువులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుత గణనలో 8,40,114 పశువులు ఉన్నట్లు సమాచారం. ఈమేరకు పశువుల సంఖ్య తగ్గింది. కాగా, పశువుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆసంఖ్యను జిల్లా పశు వైద్య, సంవర్థక శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. యాప్‌లో నమోదు చేసిన సంఖ్య తమకు కూడా తెలియదని, రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపించామని, గణనపై వెరిఫికేషన్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గృహాలు, పశువుల సంఖ్య విషయంలో రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పశువుల సంఖ్యను బహిర్గతం చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పశుగణన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుందని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని చెబుతున్నారు.
మందులు, దాణా..
పశుగణనలో తేలిస సంఖ్య ఆధారంగా వ్యాక్సిన్లు, మందులు, దాణా సరఫరా అవుతుంది. వ్యాధులు, హైరిస్క్ ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులు అదనంగా సరఫరా అవుతాయని అధికారులు పేర్కొన్నారు. పశువుల సంఖ్య తగ్గితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయా లేదా ఏదైనా సమస్య ఉందా.. తెలియదు కానీ గణన పూర్తి చేసిన తర్వాత సంఖ్యను బహిర్గతం చేయడం లేదు.
సంఖ్య గోప్యంగానే ఉంటుంది
జిల్లాలో పశుగణన పూర్తయింది. కానీ యాప్‌లో నమోదు చేయడం వల్ల ఆ సంఖ్య తెలియదు. సంఖ్య బహిర్గతం చేయవద్దని ఆదేశాలు ఉన్నాయి. గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రీ వెఫికేషన్ చేస్తుంది. తర్వాత వివరాలు కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం రెండు నెలల తర్వాత పశువుల సంఖ్య జిల్లాల వారీగా ప్రకటిస్తుంది. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది.
– డాక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా పశు
సంవర్థక శాఖ అధికారి
జిల్లాలో ఎట్టకేలకు పశుగణన పూర్తి
ఐదు సంవత్సరాల క్రితం
11,85,568 పశువులు
ప్రస్తుతం 8,40,114 పశువులు
ఉన్నట్లు సమాచారం
సంఖ్య ఆధారంగా వ్యాక్సిన్లు,
మందులు, దాణా సరఫరా
ప్రస్తుతం గణన పూర్తి..
జిల్లాలో 23 మంది డాక్టర్లు సూపర్ వైజర్లుగా, 76 మంది గోపాల మిత్రలు, పారాస్టాఫ్ ఎన్యుమరేటర్లుగా పశుగణన చేపట్టారు. డాక్టర్లు గణనను పర్యవేక్షించారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి పశువుల సంఖ్య తెలుసుకొని ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. పశువులతో పాటు రైతు పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్ ఇతర వివరాలు తెలుసుకొని సంబంధిత పోర్టల్‌లో నమోదు చేశారు.

తగ్గిన పశు సంపద!