
పాలకుర్తి ‘హస్తం’లో అసమ్మతి
తొర్రూరు/తొర్రూరు రూరల్: పాలకుర్తి ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేసిన తమను పక్కనపెడుతున్నారని కాంగ్రెస్ మండల కీలక నాయకులు అసమ్మతి గళం ఎత్తుకున్నారు. డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఉద్దేశపూర్వకంగా కీలక నేతలను పక్కన పెడుతున్నారని, సమావేశాలకు సైతం పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రెండుగా చీలడానికి ఝాన్సీరెడ్డి వైఖరే కారణమని, త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి స్థానిక పరిస్థితులను వివరిస్తామని అసమ్మతి నేతలు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలుపుతామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మేరుగు మల్లేశం, నాయకులు దేవరకొండ శ్రీనివాస్, జాటోతు బాలునాయక్, చిట్టిమళ్ల మహేశ్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.