
పాసుబుక్కులు ఇవ్వాలని రైతుల వాగ్వాదం
● నారాయణపురంలో అధికారుల స్పెషల్ డ్రైవ్
కేసముద్రం: ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం తమకు పట్టాదారుపాస్ బుక్కులు ఇవ్వాలని అధికారులతో పలువురు రైతులు వాగ్వాదానికి దిగిన సంఘటన మండలంలోని నారాయణపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణపురం గ్రామంలో కేసముద్రం, గూడూరు, బయ్యారం తహసీల్లార్లు వివేక్, నాగభవాని, నాగరాజు కలిసి దరఖాస్తుల స్వీకరణ కోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. కాగా, అక్కడికి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ..ఎంజాయ్‌మెంట్ సర్వే రిపోర్టును రిలీజ్ చేయకుండా, తమను దరఖాస్తులు ఎలా అడుగుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. తమకు పాసుబుక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యామన్నారు. ఇప్పటికై నా భూభారతి ద్వారా అర్హులైన రైతులందరికీ పాస్‌బుక్కులు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం 184 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కాగా రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో పోలీస్‌బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.