
సురక్షితం.. సుఖప్రసవం
నెహ్రూసెంటర్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఏజెన్సీ మండలాల్లోని వాగులు, వంకలు పొంగడంతో పాటు చెరువులు అలుగులు పోస్తున్నాయి. కాగా, ఏజెన్సీ ప్రాంతాల్లోని నిండు గర్భిణులు డెలివరీ సమయంలో ఇబ్బందులు పడకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారిని మైదాన ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఆయా పీహెచ్‌సీల పరిధిలో గర్భిణులను గుర్తిస్తున్నారు. వారిని మైదాన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించనున్నారు.
భయం భయంగా...
జిల్లాలో వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగడంతో ప్రధానంగా కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని గర్భిణుల భయపడుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని, మైదాన ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గర్భిణుల సుఖ ప్రసవాల కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, సమీప పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. గూడూరు, బయ్యారం మండలాల్లో ప్రసవాలు చేసేలా ప్రత్యేక సేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ కంట్రోల్ రూం నుంచి వైద్య సహాయం, సలహాలు పొందవచ్చని అధికారుతు తెలుపుతున్నారు.
వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు వాగులు, చెరువులు పొంగే ప్రాంతాల్లోని గర్భిణులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. గర్భిణులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, సమీపంలోని పీహెచ్‌సీలలో సురక్షితంగా ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశాం. ఎమర్జెన్సీ సమయాల్లో వైద్య సలహాలు, సహాయం పొందవచ్చు.
– రవి రాథోడ్, డీఎంహెచ్‌ఓ
జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు
ముంపు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గర్భిణుల తరలింపు
వర్షాల దృష్ట్యా అధికారులు,
వైద్యారోగ్యశాఖ చర్యలు