
మై ఆటో ఈజ్ సేఫ్!
జిల్లాలోని ఆటోల వివరాలు
● క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు
● ఆటోసేఫ్ పేరిట పోలీస్‌శాఖ
ప్రత్యేక కార్యక్రమం
● ప్రయాణికులు సురక్షితం,
ఆటోవాలాకు బీమా సౌకర్యం
● మహబూబాబాద్‌లో అమలుకు శ్రీకారం
పట్టణం ఆటోల సంఖ్య
మహబూబాబాద్ 1,300
కేసముద్రం 850
డోర్నకల్ 600
తొర్రూరు 340
మరిపెడ 230
ఇతర ప్రాంతాలు 7,680
మొత్తం 11,000
సాక్షి, మహబూబాబాద్: అర్ధరాత్రి రైలు దిగిన ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్లు ఉన్నారు. పట్టపగలు ఆడపిల్లను ఆటోలో ఎక్కించుకొని ఇబ్బందులు పెట్టే ఆకతాయి డ్రైవర్లు ఉన్నారు. అయితే ఎక్కడ ఏం జరిగిన ఆటో డ్రైవర్లందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం.. మంచివారిని కూడా అనుమానించిన సందర్భాలు ఉన్నాయి. కాగా, వీటికి చెక్ పెడుతూ ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరిట పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందజేసి.. ప్రయాణికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
స్కాన్ చేస్తే అన్ని వివరాలు..
పోలీస్‌శాఖ నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటోకు సంబంధించిన వివరాలన్నీ తెలిసి పోతాయి. క్యూఆర్ కోడ్ రూపకల్ప నకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఐటీ నిపుణులను జిల్లాకు పిలిపించారు. ఆటో నంబర్, ఆర్‌సీ వివరాలు, యజమాని, డ్రైవర్ ఆధార్ కార్డు, రెండు ఫాస్ ఫొటోలను ప్రత్యేకంగా క్రియేట్ చేసిన యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటి ఆధారంగా తయారు చేసిన క్యూఆర్ కోడ్‌ను ఆటోలో అతికిస్తారు. ఆటోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తమకు ఇబ్బంది వచ్చినప్పుడు లేదా.. ఇతర పరిస్థితుల్లో స్కాన్ చేసి ఇతరులకు పంపితే చాలు ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
అటో సేఫ్... ప్రయాణం సేఫ్..
జిల్లా కేంద్రం మహబూబాద్, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాల్లో 11వేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. అయితే ఇందులో ప్రయాణించేందుకు మహిళలు, విద్యార్థినులు ఇబ్బందులు పడడం, వారిపై పలు సందర్భాలో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నా యి. అదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ప్రయాణించి నేరాలకు పాల్పడడం, గంజాయి, బెల్లం అక్రమ రవాణా చేసి పట్టుపడిన ఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ దోహదపడుతుంది. ఆటోలో ప్రయాణికుల విలు వైన వస్తువులు, బ్యాగులు మర్చిపోవడం, ఆటో అడ్రస్ తెలుసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం క్యూఆర్‌కోడ్‌తో ఆ బాధలు తొలగిపోతాయి. కాగా క్యూఆర్ కోడ్ కేటాయించిన ఆటో డ్రైవర్‌కు రూ.లక్ష వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా ఆటో డ్రైవర్‌కు బీమా, ఆటోలో ప్రయాణించే వారికి ధైర్యం, నేరస్తులను పట్టుకోవడం సులభం.. ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయిస్తున్నారు.
సురక్షిత ప్రయాణానికి దోహదం
ఆటోలకు క్యూఆర్ కోడ్ కేటాయించి అతికించడంతో ఆటో డ్రైవర్‌కే కాకుండా ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి దోహదపడుతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా మహిళలు, విద్యార్థినులు ఆటోలో నిర్భయంగా ప్రయాణం చేయవచ్చు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకుంటే చాలు.. ఏ ఇబ్బంది ఉండదు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు జిల్లాలోని ఆటో డ్రైవర్లు సహకరించాలి.
–సుధీర్ రాంనాఽథ్ కేకన్, ఎస్పీ
నిర్భయంగా ఆటో నడుపుకోవచ్చు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న క్యూఆర్ కోడ్‌తో నిర్భయంగా ఆటోలు నడిపించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కరిద్దరు, జిల్లాతో సంబందం లేని వారు చేసే మోసాలతో జిల్లాలోని మొత్తం ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్యూఆర్ కోడ్ ఉంటే మనమేంటో తెలిసిపోతుంది. ప్రయాణికుల్లో నమ్మకం కలుగుతుంది
–నలమాస సాయి,
ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు

మై ఆటో ఈజ్ సేఫ్!

మై ఆటో ఈజ్ సేఫ్!