
ప్రయాణికులు గమ్యం చేరడమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: సురక్షిత ప్రయాణమే పోలీసుల లక్ష్యమని మహబూబాబాద్ టౌన్ ఇన్‌చార్జ్, రూరల్ సీఐ పి.సర్వయ్య, జిల్లా రవాణా అధికారి జయపాల్ రెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు సోమవారం ‘మైఆటో ఈజ్ సేఫ్’ అనే క్యూఆర్ కోడ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు సాఫీగా ప్రయాణించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆటోలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు జత చేస్తామని, దీంతో ప్రయాణికులు ఎలాంటి భయాందోళన లేకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. క్యూఆర్ కోడ్‌తో డ్రైవర్ పూర్తి బయోడేటా, రిజిస్ట్రేషన్ వివరాలు, ఎమర్జెన్సీ కాల్, ఎస్‌ఎంఎస్ ద్వారా ప్రయాణికులకు తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సైలు ప్రశాంత్, అశోక్, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది రామచందర్, పాపాలాల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.