
క్రీడా పాఠశాల పిలుస్తోంది..
భూపాలపల్లి అర్బన్ : విద్యార్థులకు చదువు ఎంతో ముఖ్యమో క్రీడలూ అంతే ముఖ్యం. అందుకే చిన్నప్పటి నుంచే ఈ రెండు రంగాల్లో రాణించాలి. అప్పుడే ప్రభుత్వ కొలువులు, ఇతర లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్‌లో సీటుసాధిస్తే అత్యుత్తమ క్రీడాకారులుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ కొలువులు సాధించొచ్చు. ఈనేపథ్యంలో స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలు ఎలా చేసుకోవాలి? ఎప్పుడు జరుగుతాయి? ఎలాంటి టెస్టులు పెడతారు? ఏ ప్రాంతంలో పెడుతారు అనే విషయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఎంపిక విధానం..
రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ స్కూల్ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని హకీంపేటలో, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక సామర్థ్యంతో పాటు పలు టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో మూడు స్కూళ్లు ఉండగా 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలో విద్యార్థులకు శారీరక సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు మండల, జిల్లాస్థాయిలో నిర్వహించి రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తారు.
● మండల స్థాయి పోటీలకు..
మండలస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎంతోపాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంటతెచ్చుకోవాలి. అలాగే, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు 3వ తరగతి పాస్ సర్టిఫికెట్లతో మండల స్థాయి ఎంపిక పోటీలకు హాజరుకావాలి.
● మండల స్థాయిలో ఎంపికలు..
ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు స్థాయిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.
● జిల్లా స్థాయిలో ..
ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి పంపిస్తారు.
రాష్ట్రస్థాయిలో ఎంపికలు..
జూలై 1వ తేదీన హాకీంపేట స్పోర్ట్స్ న్కూల్‌లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. జూలై రెండో వారంలో ప్రవేశాలు నిర్వహిస్తారు.
అర్హతలు..
4వ తరగతిలో ప్రవేశాలు పొందగొరే విద్యార్థులు సెప్టెంబర్ 1, 2016 నుంచి ఆగస్టు 31, 2017 మధ్య జన్మించి ఉండాలి.
అనర్హులు వీరే..
దొడ్డు కాళ్లు, ప్లాట్‌ఫీట్, వెన్నముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత బాధితులు, బౌలెగ్స్ ఉన్న వారు. అలాగే ఎక్కడైన ఎముకలు విరిగిన వారు కూడా అనర్హులు.
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో
నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు
ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లెయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6, 10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్ త్రో (కిలో బరువు), వర్టికల్ జంప్, ప్లెక్సీబిలిటీ టెస్ట్, (ముందుకు వంగి భూమిని తాకడం), మెడికల్ టెస్ట్.
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు
హకీంపేట, కరీంనగర్,
ఆదిలాబాద్‌లో పాఠశాలలు
ఒక్కో స్కూల్‌లో 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం
సద్వినియోగం చేసుకోవాలి
క్రీడాకారులుగా ఎదగాలనే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ స్కూళ్లలో చదివి అంతర్జాతీయ స్థాయితోపాటు ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌లో పాల్గొని సత్తాచాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ లభిస్తుంది. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–రఘు డీవైఎస్‌ఓ,
జయశంకర్‌భూపాలపల్లి

క్రీడా పాఠశాల పిలుస్తోంది..