
చెట్టు మీదపడి కూలీ మృతి
రఘునాథపల్లి: చెట్టు మీద పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కంచనపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని వెలబోయిన యాదగిరి తన ఇంటి ఆవరణలోని చెట్టును తొలగించేందుకు అదే గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల లింగయ్య (45)ను కూలీకి తీసుకెళ్లాడు. లింగయ్య ఆ చెట్టును రంపంతో కోస్తుండగా తెగి మీద పడింది. దీంతో తీవ్ర గాయాలైన లింగయ్యను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, లింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లే సమాచారం ఇవ్వకపోవడంపై మృతుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. లింగయ్య మృతికి కారణమైన యాదగిరిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. మృతుడికి భార్య ఎల్లమ్మ, కూతుళ్లు రజిత, రమ్య ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు.
భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
పర్వతగిరి : భర్త వేధింపులు భరించలేక మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన వసంత(22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గుగులోత్ వెంకన్న కథనం ప్రకారం.. రాయపర్తి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన శ్రీకాంత్‌తో వసంతకు నెల క్రితం వివాహామైంది. అయితే శ్రీకాంత్ వివాహేతర సంబంధం నెరుపుతూ వసంతను తరచూ వేధిస్తున్నాడు. ఈ విషయమై శ్రీకాంత్‌కు తల్లి కోమల, మేనమామ అంబటి కుమార్ సహకరించేవారు. దీంతో వేధింపులు భరించలేక వసంత శనివారం మధ్యాహ్నం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.
హసన్‌పర్తిలో చోరీ
● బంగారు, వెండి, నగదు అపహరణ
హసన్‌పర్తి: మండల కేంద్రంలోని నల్లగట్టుగుట్ట సమీపంలో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు ఖురేషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. నల్లగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి ప్రైవేట్ ఉద్యోగి. శుక్రవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం కూలర్ డోర్‌కు అడ్డంగా వేసి నిద్రించారు. శనివారం ఉదయం లేచి చూసే సరికి బీరువా తీసి కనిపినించింది. అందులో ఉన్న సుమారు పదకొండున్నర తులాల బంగారం, 48 తులాల వెండి, రూ.16వేలు నగదు, రెండు మొబైళ్లు మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై క్లూస్ టీమ్ వేలిముద్రలు సేరించగా పోలీసు జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

చెట్టు మీదపడి కూలీ మృతి