జగమేలు.. జగన్మాతా! | - | Sakshi
Sakshi News home page

జగమేలు.. జగన్మాతా!

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

కర్నూలు కల్చరల్‌: దసరా శరన్నవరాత్రులు ఆదివారం ప్రారంభమై ఈనెల 20న విజయ దశమితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో అమ్మవారి ఆలయాలతో పాటు ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. దసరా అంటేనే సందడి. సంతోషం. హిందువుల ప్రధాన పండుగ ఇది. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. పది రోజుల పాటు పరమ పావనంగా జరుపుకునే పండుగ. అమ్మవారిని రోజుకో రీతిన అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు చేస్తారు. చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి మరింత విశిష్టం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరుపుకునే పండుగే దసరా. ఇందులో తొమ్మిది రోజులు ప్రత్యేకంగా శివసతి అయిన పార్వతీ దేవిని విశేషమైన అలంకారాలతో, వేరువేరు నామాలతో పూజిస్తారు. వీరికి నవ దుర్గలు అని పేరు. ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుకే ఈ పేరు వచ్చింది.

● శనివారం అమావాస్యతో ఆశ్వీయుజ మాసం ముగిసి నిజ ఆశ్వీయుజం ప్రారంభం కావడంతో ఆదివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. అక్టోవర్‌ 20వ తేదీన విజయ దశమిని జరుపుకుంటారు. ఈ పండుగకు బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. అలయాల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. పదో రోజు పార్వేట ఉత్సవం జరుగుతుంది.

● కర్నూలుతో పాటు శ్రీశైలం, మహానంది, ఆదోని, నంద్యాల, డోన్‌, పత్తికొండ, ఎమ్మిగనూరు, నందవరం, నందికొట్కూరు, బనగాపల్లె, పాణ్యం ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు, ఆలయ కమిటీలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడేలా ఆలయాలను ముస్తాబు చేశారు. కర్నూలు నగరంలోని చిన్న అమ్మవారి శాల, పెద్ద అమ్మవారి శాల, గీతామందిరం, కాళికాంబ ఆలయం, నిమిషాంబ దేవీ ఆలయం, లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయం, అంభా భవాని ఆలయం, సప్తగిరి నగర్‌ చౌడేశ్వరీదేవి ఆలయం, అరోరానగర్‌ రాజరాజేశ్వరీ దేవి ఆలయంతో పాటు నాగలాపురం సుంకులమ్మ, వెంకాయపల్లి ఎల్లమ్మ, నన్నూరు సరస్వతి దేవి ఆలయాలతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

పార్వేటకు ప్రముఖ ప్రస్థానం

విజయ దశమి వేడుకల్లో జిల్లాలో మద్దికెర గుర్రాల పార్వేట ప్రత్యేకంగా నిలుస్తోంది. దసరా రోజు సాయంత్రం యాదవ రాజ వంశీకులకు చెందిన పెద్దనగరి, చిన్న నగరి, వేమనగరి కుటుంబాలకు చెందిన వారు ఈ పార్వేటలో పాల్గొంటారు. మద్ది కులస్తులు సైన్యంలా ఆయుధాలు ధరించి రాజ వంశీకుల వెంట గ్రామ సరిహద్దు వరకు వెళతారు. అక్కడ వారు దేవుడికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు.

సమైఖ్యతకు చిహ్నం.. కర్రల సమరం

దేవరగట్టు కర్రల సమరానికి రాష్ట్రంలో ఎంతో విశిష్టత ఉంది. దసరా రోజు అర్ధరాత్రి నుంచి దేవరగట్టు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు గ్రామాల ప్రజలు మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడం కోసం సమరానికి దిగుతారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజలు విజయ దశమికి 12 రోజుల ముందు నుంచి నిష్టగా ఉండి పూజలు చేస్తారు. 12వ రోజు అర్ధరాత్రి నుంచి కర్రల సమరం మొదలై తెల్లవారే వరకు సాగుతుంది.

సాహస విన్యాసాలకు సముచిత స్థానం

ఎమ్మిగనూరు మండలం గుడేకల్లులో విజయదశమి మరుసటి రోజు కరి పండుగనాడు యువత సాహస విన్యాసాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వీపులకు కడ్డీలు గుచ్చుకోవడం, పళ్లతో బరువులు ఎత్తడం, ఇసుక సంచులు ఎత్తడం, బండ్లు లాగడం, రాళ్ల గుండ్లు ఎత్తడం లాంటి సాహస కృత్యాలు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

చెడుపై మంచి గెలుపునకు సంకేతం

ఆదోనిలో దసరా రోజు రాత్రి మున్సిపల్‌ మైదానం, చిన్న శక్తి గుడి ఆవరణలో రావణ కుంభకర్ణుల బొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి గెలుపునకు సంకేతంగా ప్రజలు సంతోషంతో 25 అడుగుల రావణ కుంభకర్ణుల బొమ్మలను దహనం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు.

నేటి నుంచి దసరా నవరాత్రులు

ఉత్సవాలకు ముస్తాబైన

అమ్మవారి ఆలయాలు

శ్రీశైలం, మహానంది,

కర్నూలు చిన్నఅమ్మవారి శాలలో

ప్రత్యేక వేడుకలు

దసరా వేడుకల నిర్వహణకు

ఏర్పాట్లు పూర్తి

కర్నూలు పురవీధుల్లో కొలువు దీరనున్న

దుర్గా మాత విగ్రహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement