గంగవరం రీచ్‌లో దందా టీడీపీ నేత అండదండలతో
పట్టించుకుని మైనింగ్ అధికారులు
నందవరం: తుంగా తీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు, తెలుగు తమ్ముళ్ల ధన దాహానికి అంతే లేకుండా పోయింది. తెలుగు తమ్ముళ్లు రుచి మరిగి ఇసుకాసురులుగా అవతారమెత్తారు. తుంగభద్ర నదిలో వాలిపోయి అక్రమ దందాకు తెరతీశారు. రాత్రి, పగలు సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా సామన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక చాటున టీడీపీ నేతలు రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. మైనింగ్, విజిలెన్స్, పోలీసు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుకాసురులు ఇస్తున్న ముడుపులతో దోపిడీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
యథేచ్ఛగా దోపిడీ
మండలంలో ప్రభుత్వం రెండు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. నాగలదిన్నె రీచ్‌కు మాన్‌సూన్ హాలీడే ప్రకటించి ఖాళీ చేశారు. అక్కడ తవ్వకాలు పూర్తిగా నిలిపి వేశారు. ఇదే అదునుగా గంగవరంలోని రీచ్‌లో ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. తుంగభద్ర నదిలో జేసీబీలు పెట్టి ఇసుక తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు. రీచ్‌లో పని చేసే ఓ సూపర్‌వైజర్, నియోజకవర్గ టీడీపీ నేతతో చేతులు కలిపాడు. అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను డంప్ చేస్తున్నారు. దాదాపు రోజుకు 10 నుంచి 15 ట్రాక్టర్లు ఎమ్మిగనూరుకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాయి. భారీ మొత్తంలో డంప్ చేసి రాత్రి వేళ టిప్పర్లతో సరిహద్దులను దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో ఇసుకను తవ్వి తీరంలో భారీ డంప్ ఉంచారు. అక్కడి నుంచి రాత్రి, పగలు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 50 ట్రిప్పుల ఇసుక అక్కడి నుంచి తరలుతున్నట్లు అంచనా. రీచ్ నుంచి తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లకు బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. కనీసం రీచ్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు వంటివి లేకపోడంతో పాటు ట్రాక్టర్లు, టిప్పర్లకు బిల్లులు మంజూరు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక దందా సాగిస్తున్నారు.
గంగవరం వద్ద నదిలో ఇసుకను ట్రాక్టర్‌కు లోడ్ చేస్తున్న జేసీబీ గంగవరం రీచ్‌లో డంప్ నుంచి రశీదులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్
తూతూమంత్రంగా తనిఖీలు
అక్రమ రవాణా
నందవరం మండలంలో తుంగభద్ర నది నుంచి ఇసుకను తెలుగు తమ్ముళ్లు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం మైనింగ్ అధికారులు బేఖతార్ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా జోరుగా సాగుతుంది. అధికారుల నిఘా నిద్రపోతోంది. అధికారులు సైతం అధికార పార్టీ నాయకులకు జీ హూజూర్ అంటూ తనిఖీలు నిర్వహించడం లేదు. టీడీపీ నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికై నా మైనింగ్, విజిలెన్స్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు, ప్రజలు కోరుతున్నారు.


