ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ‘పచ్చ’ పన్నాగం! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ‘పచ్చ’ పన్నాగం!

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

● గోనెగండ్ల మండంలోని చిన్నమర్రివీడులో టీడీపీ నేతలకు మద్దతు లేకపోవడంతోనే వాయిదా వేశారు.

● దేవనకొండ మండలంలోని తెర్నేకల్లు జెడ్పీహైస్కూల్‌లో, కప్పట్రాళ్ల జెడ్పీ హైస్కూల్‌, నల్లచెలిమల ఎంపీపీఎస్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండడంతో టీడీపీ నేతల ఒత్తిడితో ఎన్నికలు వాయిదా వేశారు.

● కోడుమూరు మండలంలోని అమడగుంట్లలో టీడీపీలో ఉన్న గ్రూప్‌ రాజకీయాలతో, వర్కూర్‌ గ్రామంలో ఓటింగ్‌లో రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.

కర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు స్కూల్‌ యాజమాన్య కమిటీలకు నిర్వహిస్తున్న ఎన్నికలను పక్కదోవ పట్టించారు. గత నెల 29న జిల్లా వ్యాప్తంగా 1442 స్కూళ్లలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. పింఛన్‌ రద్దు చేయిస్తామని బెదిరించి చాలా చోట్ల బలవంతంగా పిల్లల తల్లిదండ్రులతో చేతులు ఎత్తించారు. తాము అనుకున్నవారు చైర్మన్‌గా ఎంపిక కారు అని తెలిసి 51 స్కూళ్లలో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేయించారు. ఇక్కడ అడ్డదారుల్లో గెలిచేందుకు అనేక ఎత్తుగడలు వేశారు. దేవనకొండ మండలంలో మూడు, గోనెగండ్లలో రెండు, గూడురులో రెండు, కోడుమూరులో నాలుగు, కోసిగి 2, మద్దికేరలో ఒకటి, నందవరంలో ఒకటి మొత్తం 15 స్కూళ్లలో కోరం లేదని ఎన్నికలను వాయిదా వేశారు.

ప్రలోభాలు.. బెదిరింపులు

కర్నూలు రూరల్‌ మండల పరిధిలోని ఉల్చాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఇద్దరు ఎస్‌ఐలను, పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ 402 మంది విద్యార్థులు చదువుతున్నారు. శనివారం 336 మంది విద్యార్థులు హాజరుకాగా ఎన్నికలకు 153 మంది కోరం. అయితే తల్లిదండ్రులు 205 మంది వరకు ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు. ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలతో ప్రతిపక్షపార్టీలకు చెందిన వారు అత్యధికంగా మంది సభ్యులుగా ఎంపిక అవుతారని గత నెల 29వ తేదీ కోరం లేదని వాయిదా వేయించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు గెలిచేందుకు ఓ పన్నాగం పడ్డారు. స్కూల్‌ దగ్గరకు టీడీపీ కండువాలతో వందలాది మంది వచ్చి ఎన్నికలకు రాకపోతే పిల్లలకు తల్లికి వందనం రాదని ఫోన్లలో తల్లిదండ్రులను బెదిరించారు. ఎన్నికల ప్రక్రియకు హాజరైన వారికి డబ్బులు, మద్యంతో ఎర వేశారు. ప్రతిపక్షపార్టీల తరఫున పోటీలో నిలబడేందుకు వెళ్లిన వారి దగ్గరకు వెళ్లి..మీ ఇంట్లో ఫించన్‌ తీయిస్తామని ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బెదిరించారు. పాఠశాలల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదనే అభిప్రాయం తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహారించడంతోనే చాలా చోట్ల వాయిదా పడ్డాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పింఛన్‌ రద్దు చేయిస్తామని

తల్లిదండ్రులకు బెదిరింపులు

ఉల్చాలలో సభ్యుల ఎన్నికలకు

డబ్బుతో ప్రలోభాలు

టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన

విద్యాశాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement