● గోపవరం చెరువులో మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
మహానంది: అధికార పార్టీ నేతల అండదండలతో చెరువులను కొల్లగొడ్డుతున్న ఓ కాంట్రాక్టర్ మట్టి అక్రమ రవాణాను ప్రజలు అడ్డుకున్నారు. గోపవరం గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలిసికట్టుగా చెరువు వద్దకు చేరి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, జేసీబీలను అడ్డుకున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న 167కే హైవే రహదారికి అవసరమైన మట్టినంతా మహానంది మండలం నుంచే తరలిస్తున్నారు. ఇటీవల మహానంది మండలం బసవాపురం, గాజులపల్లె గ్రామాల్లోని చెరువులతో పాటు ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ బోర్డు, రవాణా లాంటి శాఖల అధికారుల అనుమతు ల్లేకుండానే ఒక్కొక్క టిప్పర్‌లో 25 మెట్రిక్ టన్నుల మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పొలాలను చెరువులను చేస్తున్న తీరుపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో గోపవరం బైరవాణి చెరువుపై కన్నేసి జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందల టిప్పర్లతో మట్టిని తరలించేస్తున్నారన్న విషయం తెలుసుకున్న గోపవరం గ్రామ రైతులు పుల్లయ్యయాదవ్, మల్లెల ప్రసాద్, సుధాకర్, తదితరులు చెరువు వద్దకు చేరుకుని టిప్పర్లు, జేసీబీలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు పంపించారు.
ఉన్నతాధికారులు చెప్పారని..
గోపవరం బైరవాణి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై గ్రామానికి చెందిన రైతులు గత నెల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులే ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. అయితే హైవే నిర్మాణం పనులు దక్కించుకున్న పెద్ద సంస్థ కాంట్రాక్టర్లకు రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో వారికి ఉన్న పలుకుబడి మేరకు ఓ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి చెప్పాడనే ప్రచారంతో మట్టి తరలింపునకు శ్రీకారం చుట్టారు. అడ్డుకున్న రైతులతో టిప్పర్ డ్రైవర్లు తమ వద్ద ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేవని చెప్పడంతో వారి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రైతులు పుల్లయ్యయాదవ్, మల్లెల ప్రసాద్ ఆరోపించారు. మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయకపోతే గ్రామ రైతులమంతా కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.


