కర్నూలు(సెంట్రల్): హంద్రీనీవాలో మరో పది రోజులు, ఎల్‌ఎల్సీ నవంబర్ 10వ తేదీ వరకు నీటి ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని చెరువులను వెంటనే నింపాలని జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జెడ్పీ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 35 చెరువులలో ఇంకా 18 చెరువులు నీటితో ఉండాల్సి ఉందని, ఇందులో 11 చెరువులో 75 శాతం, 5 చెరువులు 50 శాతం, 2 చెరువులు 25 శాతం నిండాల్సి ఉందని, త్వరగా నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పెండింగ్ పనులు, హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల పనులు, టాయిలెట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీసీఈవో సుధాకర్ రెడ్డి, పీఆర్ ఎస్.ఈ చంద్రా రెడ్డి ఈఈ శివసాగర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అబ్దుల్ ఖాదర్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ జితేంద్ర, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్ మూర్తి పాల్గొన్నారు.
న్యాయాధికారులకు
నైపుణ్య శిక్షణ
కర్నూలు(టౌన్): కర్నూలులోని ప్రిన్సిపల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాల న్యాయాధికారులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో మాస్టర్ ట్రైనర్లు విజయవాడ 8వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు సివిల్ జడ్జి, బనగానపల్లె సివిల్ జడ్జి ఎస్.ప్రతిమలు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు డి.లక్ష్మీ, లక్ష్మీరాజ్యం, అదనపు జిల్లా జడ్జిలు శ్రీవిద్య, రాజేంద్రబాబు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జ్జీలు పాల్గొన్నారు.
ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): పప్ప శనగ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను జిల్లా వ్యవసాయ అధికారి పీల్ వరలక్ష్మి తనిఖీ చేశారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు పప్పు శనగ విత్తనాలను ప్రాసెసింగ్ చేస్తున్న శివసాయి సీడ్స్, మహంకాలేశ్వర అగ్రిటెక్ యూనిట్లలో తనిఖీలు చేపట్టి నాణ్యతను పరిశీలించారు. జిల్లాకు 33,200 క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కేటాయించగా.. ఇప్పటి వరకు 6,951 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాల్లో ఉంచామన్నారు. రైతులకు ఉచితంగా సరఫరా చేయనున్న విశిష్ట రకం వేరుశనగ నాణ్యతను కూడా జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీ చేశారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కు నన్నూరులోని శివసాయి కోల్డ్ స్టోరేజీ, రబ్బాని కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలు వేరుశనగను సరఫరా చేయనున్నాయి. ఈ వేరుశనగ నాణ్యతను డీఏవో పరీక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట కర్నూలు ఏడీఏ దస్తగిరిరెడ్డి, సాంకేతిక ఏవోలు రాఘవేంద్ర, అనిల్‌కుమార్, ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్‌చార్జీలుగా నియమించిన ఏవోలు ఉన్నారు.


