శ్రీశైల దేవస్థాన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైల దేవస్థాన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

● రెవెన్యూ విభాగ ఏఈవో, పర్యవేక్షకులు, గుమస్తాలకు షోకాజ్‌ నోటీసులు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థాన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా గతంలో విధులు నిర్వహించిన రమణను సస్పెండ్‌ చేస్తూ ఈఓ ఎం.శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీన ‘మల్లన్నకు శఠగోపం!’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌, సభ్యులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని దేవస్థాన ఈఓతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు ఈఓ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విధు ల పట్ల అలసత్వం ప్రదర్శించి, దేవస్థాన నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు టెండర్‌దారుడికి సహకరించినట్లు విచారణలో తేలడంతో దేవస్థాన రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన రమణపై వేటు వేశారు. అలా గే గణేశ సదన్‌ వద్ద హోటల్‌ టెండర్‌, అగ్రిమెంట్‌, నిర్వహణ సమయంలో విధుల్లో ఉన్న దేవస్థాన రెవెన్యూ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఇ.చంద్రశేఖరరెడ్డి, పర్యవేక్షకులు శ్రీనివాసరావు, గుమస్తా చంద్రశేఖర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారం రోజులో వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు.

ఉచిత వేరుశనగ పంపిణీ చేయలేం

● చేతులెత్తేసిన ఆలూరు డివిజన్‌ వ్యవసాయ అధికారులు

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం కింద రబీ సీజన్‌లో 100 శాతం సబ్సిడీపై 1,500 క్వింటాళ్ల విశిష్ట రకం వేరుశనగను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్‌లు ఉండగా.. అన్ని డివిజన్‌లకు కేటాయించారు. అయితే ఆలూరు డివిజన్‌లోని ఏవో లు మాత్రం తాము వేరుశనగను పంపిణీ చేయలేమని చేతులెత్తేయడం గమనార్హం. ఏవోల తరఫున ఏడీఏ చెంగల్రాయుడు జిల్లా వ్యవసాయ అధికారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆలూరు డివిజన్‌కు కేటాయించిన వేరుశనగను ఇతర డివిజన్‌లకు సర్దుబాటు చేస్తున్నారు.

ఆటో బోల్తా పడి వృద్ధురాలి మృతి

నందికొట్కూరు: పాములపాడు మండలం కృష్ణానగర్‌ సమీపంలోని కేసీ కెనాల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివాహ నిశ్చయం కుదుర్చుకునేందుకు నంద్యాల పట్టణం క్రాంతినగర్‌ నుంచి ఓ కుటుంబం ఆటోలో బయలుదేరింది. కృష్ణానగర్‌కు చేరుకుంటుండగా కేసీ కెనాల్‌ వద్ద ఆటో డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయకపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న దూదేకుల పెద్దనాగమ్మ(85), మౌలాలమ్మ, గోకారమ్మ, నాగన్న, రాజమ్మ, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పెద్ద నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement