● ఈత సరదాతో ప్రాణాలమీదకు.. ● కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, బంధువులు
జూపాడుబంగ్లా: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురిలో ఒకరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందగా మిగతా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటన మంగళవారం కనకయ్యకొట్టాల గ్రామంలో చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేకల శివలింగేశ్వరుడు, పార్వతి దంపతుల చిన్న కుమారుడు మేకల లింగస్వామి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి గ్రామంలోని వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఉన్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింగస్వామిని స్నేహితులు అదే గ్రామానికి చెందిన శివకృష్ణ, సాయి, జశ్వంత్ లేపి కేసీ కాల్వలో ఈతకు తీసుకెళ్లారు. వీరెవరికీ సక్రమంగా ఈత రాకపోయినప్పటికీ సరదాగా కాల్వలో దిగారు. సాయి కాలుజారి ప్రవాహంలో చిక్కుకోగా అతన్ని రక్షించేందుకు లింగస్వామి (15) కాస్త ముందుకెళ్లటంతో కొట్టుకుపోయాడు.. సాయి ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగాడు. లింగస్వామిని కాపాడేందుకు సాయి, శివకృష్ణ, జశ్వంత్ యత్నించినా ప్రయోజనం లేకపోవటంతో గ్రామస్తులకు విషయం తెలియజేయగా వారు కాల్వ వెంట గాలింపు చేపట్టారు. కాల్వ 114 తూము వద్ద లింగస్వామి మృతదేహం లభ్యమైంది. అతని మృతదేహాన్ని ఇంటికి చేర్చగా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. విషయం తెలుసుకుని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థి లింగమయ్య పార్థివ దేహాన్ని చూసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


